రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి వల్ల మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని విరుచుకుపడ్డారు.
కార్మికుల హక్కుల కోసం శంకర్ గౌడ్ తన ప్రాణాలనే బలిదానం చేశారని.. బెదిరింపు రాజకీయాలతో పాలన సాగించడం సరైంది కాదని ఆయన హెచ్చరించారు. నేడు ఆర్టీసీ కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయని, రిటైర్మెంట్ తర్వాత వారికి వచ్చే డబ్బులు ఆసరా పెన్షన్ కంటే తక్కువగా ఉండటం సిగ్గుచేటని మండిపడ్డారు.
నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మొండికేస్తే, బీజేపీ పోరాటంతోనే ఆ సర్కార్ దిగివచ్చింది.. నేడు కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తోందన్నారు బండిసంజయ్. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కార్మికులు అడుగుతున్నారని అన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీ.. నేటికి 900 రోజులు గడుస్తున్నా అతీగతీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చింది అభయహస్తం కాదు అది 'భస్మాసుర హస్తం అని బండి సంజయ్ మండిపడ్డారు.
మళ్ళీ కమిటీల పేరుతో కాలయాపన ఎందుకు? మేనిఫెస్టోలో పెట్టినప్పుడే మీకు స్పష్టత లేదా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సంపదను పక్క రాష్ట్రాల ఎన్నికల కోసం కాంగ్రెస్ మళ్లిస్తోందని.. మంత్రులు అక్రమంగా సంపాదించిన భూముల్లో సగం అమ్మినా కార్మికుల కష్టాలు తీరుతాయని ఆరోపించారు.ఆర్టీసీ కార్మికులు ఎవరూ తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దని.. బీజేపీ అండగా ఉంటుందని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. ట్రైనింగ్ లేని వారితో బస్సులు నడిపిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని, వెంటనే ప్రభుత్వం దిగివచ్చి సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

