ఈ కుక్కలకు పిచ్చి పట్టిందా ఏంటీ : 25 గొర్రెలను కరిచి చంపేశాయి..!

ఈ కుక్కలకు పిచ్చి పట్టిందా ఏంటీ : 25 గొర్రెలను కరిచి చంపేశాయి..!

జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఏకంగా 25 గొర్రెలు ప్రాణాలు కోల్పోగా, మరొక 20 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర తీవ్రతను రేకెత్తించింది.

చొప్పదండి నియోజకవర్గం, కోడిమ్యాల మండలం కొనాపూర్ గ్రామానికి చెందిన గొర్ల కాపరి మిరపల పర్వతాలు తన గొర్ల మందను ఒకచోట ఉంచగా... రాత్రి వేళ వీధి కుక్కల గుంపు ఒక్కసారిగా వాటిపై దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్ర గాయాలై 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డానని బాధితుడు కన్నీరుమున్నీరవుతున్నాడు.

ఈ ఘటనపై చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం తక్షణమే స్పందించారు. బాధిత గొర్ల కాపరి పర్వతాలుతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వెంటనే జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించిన ఎమ్మెల్యే, ప్రభుత్వం ద్వారా బాధితుడికి తగిన ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని, కచ్చితంగా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.