భారత్‌లో ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్?.. టాడ్ గ్రీన్‌బర్గ్ కామెంట్స్ వైరల్!

భారత్‌లో ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్?.. టాడ్ గ్రీన్‌బర్గ్ కామెంట్స్ వైరల్!

AUS vs Eng Ashes Series In India: క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యాషెస్ (Ashes) టెస్టు సిరీస్‌ను ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియాలలో కాకుండా భారత్‌లో నిర్వహించే అవకాశం ఉందా? అంటే అవును అనే సమాధానం ఇస్తుంది క్రికెట్ ఆస్ట్రేలియా (CA). 1882 నుంచి కేవలం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాలలోని స్టేడియాల్లో మాత్రమే జరిగే ఈ సిరీస్.. భవిష్యత్తులో ఇండియాలో నిర్వహించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆయా అవకాశాలను పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ టోడ్ గ్రీన్‌బర్గ్ (Todd Greenberg) వెల్లడించారు.

భారత్‌లో యాషెస్ సిరీస్ ఎందుకంటే: 
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో భారతదేశం అతి పెద్ద కమర్షియల్ మార్కెట్‌గా ఎదగడమే కాకుండా, టెస్టు క్రికెట్‌కు ఇక్కడ అద్భుతమైన మంచి లభిస్తోంది. బీబీసీ (BBC)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టోడ్ గ్రీన్‌బర్గ్ మాట్లాడుతూ.. భారత్‌లో యాషెస్ మ్యాచ్ నిర్వహించడంపై ప్రస్తుతం ప్రణాళికలేవీ లేకపోయినప్పటికీ, ఆ ఆలోచనను పూర్తిగా పక్కనబెట్టలేమన్నారు. క్రికెట్ ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB)తో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తో కూడా బలమైన సంబంధాలు ఉన్నాయన్నారు. ఒకవేళ ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చాలంటే బీసీసీఐ, ఈసీబీల ఆమోదం తప్పనిసరి అన్నాడు. 

టెస్టు క్రికెట్ బలోపేతం: 
ప్రపంచవ్యాప్తంగా టెస్టు క్రికెట్ ఆదరణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ.. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లకు మాత్రం అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోందని ఆసీస్ క్రికెట్ చీఫ్ గ్రీన్‌బర్గ్ తెలిపారు. ఈ సాంప్రదాయక ఫార్మాట్‌ను మరింత విస్తరించడానికి, బలోపేతం చేయడానికి కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్‌లో ఏడాదికి ఉండే 365 రోజులు సరిపోవడం లేదని, మ్యాచ్‌ల నిర్వహణే అతిపెద్ద సవాలుగా మారిందన్నాడు. 

►ALSO READ | ఏషియన్ గేమ్స్ 2026 క్రికెట్ షెడ్యూల్ రిలీజ్.. భారత్ మ్యాచ్‌లు ఎప్పుడంటే?

చెన్నైలో బిగ్ బాష్ లీగ్ ఓపెనింగ్ మ్యాచ్:  
యాషెస్ సంగతి పక్కనబెడితే, భారత మార్కెట్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ ముద్రను మరింత పెంచేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా మరో కీలక అడుగు వేస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ టీ20 లీగ్ బిగ్ బాష్ లీగ్ (BBL)లోని ఓపెనింగ్ మ్యాచ్‌ను చెన్నై వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐతో సీఏ చర్చలు జరుపుతుంది. ఒకవేళ భవిష్యత్తులో భారత్‌లో యాషెస్ మ్యాచ్ గనుక జరిగితే, అది 140 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.