రుతు పవనాల ప్రభావంలో ఉత్తర, ఈశాన్య భారత దేశంలోని రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. కొన్ని చోట్ల క్లౌడ్ బరస్ట్ తో, భారీవర్షాలతో స్థానిక నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వరద ప్రవాహంలో కొట్టుకు పోయాయి. కొండచరియలు విరిగిపడి హైవేలపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు ,కొండచరియలు విరిగిపడటంతో అస్సాం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో రానున్న రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని IMD హెచ్చరించింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా జమ్మూ శ్రీనగర్ హైవే పూర్తిగా మూసివేశారు. డూరు రోజులుగా 600 వాహనాలు జమ్మూ శ్రీనగర్ హైవే పై నిలిచిపోయాయి. జఖానీ, బనిహాల్ మధ్య ఈ వాహనాలు నిలిచిపోయయి. పరిస్థితి మెరుగుపడే వరకు ప్రయాణాలు మానుకోవాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు.
మరోవైపు భారీ వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్ లో డజనుకు పైగా హైవేలు మూసివేశారు. గత ఐదు రోజులుగా అమర్ నాథ్, వైష్ణోదేవీ పుణ్యాక్షేత్రాలు మూసివేశారు. ప్రజలు వేలాది మంది మార్గమధ్యలో చిక్కుకున్నారు.
లోతట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల వల్ల ఇళ్లు, వంతెనలు, విద్యుత్ తీగలు దెబ్బతిన్నాయి.గురువారం(జూలై23) సాయంత్రం వరకు మరింత వర్షం కురిసే అవకాశం ఉందని, మరుసటి రోజు మరోసారి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
