V6 News

మైన్లు పెట్టే బోట్లను షూట్ చేయండి .. యూఎస్ నేవీకి ట్రంప్ ఆదేశం

మైన్లు పెట్టే బోట్లను షూట్ చేయండి .. యూఎస్ నేవీకి ట్రంప్ ఆదేశం

 

  •     చిన్న బోటైనా, పెద్ద బోటైనా దేనినీ వదలవద్దు
  •     ఇప్పటికే ఇరాన్ షిప్పులను సముద్రంలో ముంచేశామని కామెంట్

వాషింగ్టన్: హార్మూజ్  జలసంధిలో మైన్లు పెట్టే బోట్లను షూట్  చేయాలని తన దేశ నేవీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  ఆదేశించారు.  ఈ విషయాన్ని ఆయన తన ట్రూత్ సోషల్ లో వెల్లడించారు. బోటు చిన్నదైనా, పెద్దదైనా దేనినీ వదలపెట్టరాదని సూచించారు. ఇప్పటికే ఇరాన్ కు చెందిన అన్ని నౌకలను సముద్రంలో ముంచేశామని పేర్కొన్నారు. కాగా.. హార్మూజ్ లో మైన్లను తొలగించే ప్రక్రియ ప్రారంభించామని యూఎస్  నేవీ చేసిన ప్రకటనను ఇరాన్  తోసిపుచ్చింది. హార్మూజ్ లో తాము 1400 చ.కి.మీ. మేర మైన్లను పెట్టామని ఐఆర్జీసీ ఇదివరకే పేర్కొన్నది. హార్మూజ్ లో మైన్లను తొలగించడానికి కనీసం ఆరు నెలలు పట్టవచ్చని అమెరికా పేర్కొంది. కాగా, ఇరాన్ తో సంబంధం ఉన్న మరో ట్యాంకర్ ను సీజ్  చేశామని అమెరికా మిలిటరీ పేర్కొంది. ఇరాన్  ఆయిల్ ను ఆ ట్యాంకర్  అక్రమంగా రవాణా చేస్తోందని ఆరోపించింది. ఈ మేరకు అమెరికా రక్షణ శాఖ ఒక వీడియోను రిలీజ్  చేసింది.  

హార్మూజ్ లో ఇరాన్ టోల్ వసూళ్లు.. 

హార్మూజ్ లో నౌకల నుంచి ఇరాన్ టోల్ వసూళ్లు ప్రారంభించింది. తొలి వసూళ్లను ఇప్పటికే తమ దేశ సెంట్రల్ బ్యాంక్ లో జమ చేశామని గురువారం ఇరాన్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ హమీద్ రెజా వెల్లడించారు. కాగా, హార్మూజ్ గుండా వెళ్లే ఒక్కో నౌక నుంచి 2 మిలియన్ డాలర్ల(రూ.18 కోట్లు) టోల్ ఫీజు వసూలుకు ఇరాన్ నిర్ణయం తీసుకున్నది. అయితే, ఏ యే నౌకలపై వసూలు చేశారన్నది వెల్లడికాలేదు.