V6 News

మహిళల బ్యాంకు ఖాతాల్లో 36 వేలు జమ చేస్తం: ప్రధాని మోదీ

మహిళల బ్యాంకు ఖాతాల్లో  36 వేలు జమ చేస్తం: ప్రధాని మోదీ
  • బాలికల గ్రాడ్యుయేషన్ కు రూ. 50 వేలు ఇస్తం
  • బెంగాల్ రెండో దశ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ 
  • 10 గ్యారంటీల ప్రకటన

కోల్ కతా: పశ్చిమ బెంగాల్​లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాది కాలంలో మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ.36 వేలు జమ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అలాగే, బాలికల గ్రాడ్యుయేషన్ కోసం రూ. 50 వేల ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌‌‌‌‌‌‌‌కు ముందు గురువారం కృష్ణానగర్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ.. రాష్ట్రంలోని మహిళలు, పిల్లల సంక్షేమం కోసం 10 గ్యారంటీలను ప్రకటించారు. 

బెంగాల్​లో బీజేపీ అధికారంలోకి రాగానే.. గర్భిణులకు రూ. 21 వేల  ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు.  పిల్లల మెరుగైన పోషణ కోసం అదనంగా రూ. 36 వేలు అందిస్తామని, సుకన్య సమృద్ధి యోజన కింద ఆడపిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్వయం ఉపాధి కోసం ముద్ర పథకం కింద రూ. 20 లక్షల వరకు రుణాలు ఇస్తామన్నారు. ప్రతి బ్లాక్‌‌‌‌‌‌‌‌లో ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

బీజేపీ ఘన విజయం ఖాయం 

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో రికార్డు స్థాయిలో 90 శాతం ఓటింగ్ నమోదు కావడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.  ఇంత భారీ స్థాయిలో ప్రజలు తరలిరావడం చూస్తుంటే, బెంగాల్‌‌‌‌‌‌‌‌లో బీజేపీ ప్రభంజనం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్‌‌‌‌‌‌‌‌లో టీఎంసీ "సిండికేట్ వ్యవస్థ, మహా జంగిల్ రాజ్"కు మే 4వ తేదీతో ఎక్స్‌‌‌‌‌‌‌‌పైరీ డేట్ ముగిసిపోతుందని ప్రధాని అన్నారు. టీఎంసీ సృష్టించిన 'భయం' (భోయ్), బీజేపీ ఇస్తున్న 'భరోసా' (విశ్వాసం) చేతిలో ఓడిపోవడం ఖాయమని చెప్పారు. 

మేం గెలిస్తే చొరబాట్లు జరగనివ్వం: అమిత్ షా 

బెంగాల్​లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోకి ఒక్క చొరబాటుదారుడిని కూడా అనుమతించబోమని కేంద్ర హోం మంత్రి అమిత్​షా అన్నారు. గురువారం హుగ్లీ జిల్లా బాలాఘర్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్​షా మాట్లాడారు.

 ‘‘చొరబాటుదారులు బెంగాల్ యువత ఉద్యోగాలను, పేదల రేషన్‌‌‌‌‌‌‌‌ను తినేస్తున్నారు. దేశ భద్రతను దెబ్బతీయడానికి పనిచేస్తున్నారు. బెంగాలీలు టీఎంసీ సిండికేట్‌‌‌‌‌‌‌‌కు ‘భాయ్‌‌‌‌‌‌‌‌పో’ పన్ను చెల్లించాల్సి వస్తోంది. సిమెంట్ కొనడానికి కూడా ప్రజలు డబ్బు చెల్లించక తప్పడం లేదు. మమత ప్రభుత్వానికి 'టాటా- బై-బై' చెప్పండి. మేము సిండికేట్ నిర్వాహకులకు బుద్ధి చెబుతాం’’ అని ఆయన అన్నారు.