V6 News

ప్లాట్లతో పాటు రోడ్లనూ అమ్ముకున్నరు!...సూరారంలో వెంచర్ వద్ద ఆందోళన

ప్లాట్లతో పాటు రోడ్లనూ అమ్ముకున్నరు!...సూరారంలో వెంచర్ వద్ద ఆందోళన
  •     కాంపౌండ్ ను కూల్చివేసిన బాధితులు

లక్సెట్టిపేట, వెలుగు: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం సూరారంలో వేసిన ఓ వెంచర్ వద్ద గురువారం సాయంత్రం భూ కొనుగోలుదారులు ఆందోళన చేపట్టారు. తమకు అమ్మిన ప్లాట్లకు ఏర్పాటు చేసిన దారిని కూడా అమ్ముకున్నారని, ఆ దారిని కొన్న వ్యక్తి కాంపౌండ్ నిర్మించడంతో బాధితులు ఆ గోడలను తొలగించారు. సూరారంలో మూడేండ్ల కింద ఓ రియల్ ఎస్టేట్ సంస్థ మూడెకరాల్లో వెంచర్ చేసి, 53 ప్లాట్లను విక్రయించారు. కాగా సంస్థకు చెందిన ఓ భాగస్వామి ప్లాట్లతో పాటు అందులోని రోడ్డును కూడా అమ్మినట్లు సమాచారం. 

విషయం తెలుసుకున్న కొనుగోలుదారులు, ఏజెంట్లు వెంచర్ వద్దకు చేరుకొని రోడ్డు చుట్టూ పెట్టిన గోడలను తొలగించారు. ఒక్కో ఫ్లాట్ సుమారు రూ.15 లక్షలు పెట్టి కొన్నామని,  ప్లాట్ల వద్ద కబ్జాలకు పాల్పడుతుండడం దారుణమన్నారు. సంస్థ భాగస్వాములను సంప్రదిస్తే సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని, తమకు న్యాయం చేయాలని కోరారు.