- కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రైతులకు సరఫరా చేయడానికి తగినంత యూరియా అందుబాటులో ఉందా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. యూరియా యాప్‌పై టీవీలు, హోర్డింగ్‌లు, ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారా అని అడిగింది. యూరియా కొరత తలెత్తకుండా తీసుకుంటున్న చర్యలపై పూర్తి వివరాలతో కౌంటర్దాఖలు చేయాలని సూచించింది. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేసేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకోవడం లేదని, యాప్‌ను రద్దు చేయాలంటూ బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, మరో నలుగురు రైతులు హైకోర్టులో పిల్ వేశారు.
దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం.మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. యూరియా సరఫరా సక్రమంగా జరగడం లేదన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్‌తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని చెప్పారు. అసైన్డ్ భూములున్న రైతులకు యూరియా ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది బి.మోహనారెడ్డి మాట్లాడుతూ.. నిజమైన రైతులకు యూరియా అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు.
యాప్ ద్వారా బుక్‌చేసుకుంటే వెంటనే తీసుకెళ్లవచ్చని, క్యూలో ఉండాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై బెంచ్ కలగజేసుకొని.. రైతులందరూ సాంకేతిక నిపుణులు కారని, వారిలో ఎంత మందికి ఫోన్లు ఉంటాయని ప్రశ్నించారు. ప్రభుత్వ న్యాయవాది సమాధానమిస్తూ.. ఫోన్ లేనివారికి, అవగాహన లేనివారికి యూరియా కోసం నమోదు చేయడానికి ఆయా కేంద్రాల్లో వలంటీర్లు అందుబాటులో ఉంటారన్నారు. అంతేకాకుండా రైతులు తమ స్నేహితులు, బంధువుల ఫోన్ల ద్వారా యూరియా బుక్చేసుకోవచ్చని చెప్పారు. అసైన్డ్ భూములున్న రైతులకు కూడా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. వాదనలను విన్న బెంచ్ కౌంటర్దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

