ఆగే పనిలేదు : టోల్ ప్లాజాలలో ఫాస్టాగ్ విధానం 

ఆగే పనిలేదు : టోల్ ప్లాజాలలో ఫాస్టాగ్ విధానం 

టోల్ గేట్ వద్ద ఆగే పనిలేదు

టోల్ ప్లాజాలలో  ఫాస్టాగ్ విధానం 

 రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా పనితీరు

హైదరాబాద్, వెలుగు : ఔటర్​ రింగ్​ రోడ్డు( ఓఆర్ఆర్) పై ఉన్న టోల్ గేట్ల వద్ద ఇకపై  వాహనాలు ఆగాల్సిన పని ఉండదు. తక్కువ వేగంతో దూసుకుపోవచ్చు. టోల్ గేట్​ ఫీజు చెల్లించేందుకు క్యూలో నిలబడాల్సిన పనిలేకుండానే ఆటోమేటెడ్ టోల్ పేమెంట్ వ్యవస్థను హైదరాబాద్​ మెట్రో డెవలప్​మెంట్​ అథారిటీ(హెచ్ఎండీఏ) కమిషనర్​ అందుబాటులోకి తీసుకువస్తున్నారు.   రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా పనిచేసే వ్యవస్థకు గత వారంరోజులుగా ట్రయల్ రన్  సక్సెస్ పుల్ గా లాంచ్​ చేశారు. దీంతో ఓఆర్ఆర్ పైన ఉన్న​ టోల్ ప్లాజాలన్నీ ఫాస్టాగ్ విధానం అందుబాటులోకి వచ్చింది.

కేంద్ర రోడ్డు రవాణా సంస్థ ఆదేశాల మేరకు ఓఆర్ఆర్ పై ఉన్న టోల్ ప్లాజాలలో ఫాస్టాగ్ విధానం అందుబాటులోకి వచ్చింది. దాదాపు 158 కి.మీల వరకు విస్తరించిన ఓఆర్ఆర్ పై 19 టోల్​ ప్లాజాలు ఉన్నాయి.  ప్రతి టోల్​ ప్లాజాలోని అన్ని లైన్లలో ఈ విధానాన్ని విజయవంతంగా ఏర్పాటు చేశారు.  వారం రోజులుగా టోల్ నిర్వహకులు, హెచ్ఎండీఏ అధికారులు కలిసి ట్రయల్ రన్ నిర్వహించారు. గురువారం నుంచి పూర్తి స్థాయిలో ఈ విధానం వినియోగంలోకి వచ్చింది. దీంతో అన్ని ప్లాజాలలో ఇకపై ఆర్.ఎఫ్​.ఐడీ ఆధారంగా బిల్లు చెల్లించే వెసులుబాటు ఉంటుందనీ హెచ్ఎండీఏ వర్గాలు చెబుతున్నాయి.

దేశవ్యాప్తంగా టోల్ గేట్లలో ఎలక్ట్రానిక్ కలెక్షన్  వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో టోల్ గేట్ల వద్ద ఇప్పటివరకు మ్యాన్యువల్, డిజిటల్ కార్డుల ఆధారంగా ఛార్జీలు వసూలు చేస్తుండగా, ఆర్​.ఎఫ్​.డీ విధానంతో  ఆటోమేటిగ్గా చెల్లించవచ్చు.  దీంతో రేడియో ఫ్రీక్వెన్సీ పరికరాన్ని అమర్చుకున్న వాహనాలు గేట్ వద్దకు రాగానే ఫాస్టాగ్ కు లింక్  చేసిన బ్యాంకు నుంచి డబ్బులు కట్ అయిపోతాయి. దీంతో టోల్ గేట్ వద్ద క్యూ కట్టాల్సిన పనిలేకుండా ఎక్స్ ప్రెస్ వే నుంచి దూసుకుపోయే వీలుంటుందనీ హెచ్ఎండీఏ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఓఆర్ఆర్ పై ఉన్న అన్ని టోల్ గేట్ల నుంచి దాదాపు కోటిపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఫాస్టాగ్ ఉన్న వాహనదారులకు మరింత సులభంగా జర్నీ చేసే వీలుంటుంది. కేంద్రం విధించిన గడువు లోగా అన్ని ప్లాజాలను ఆధునీకరించామనీ అధికారులు తెలిపారు. అదేవిధంగా ఈ వ్యవస్థ సజావుగా కొనసాగించేలా మౌలిక వసతులను మెరుగుపరిచారు. ముఖ్యంగా సేవల్లో అంతరాయం లేకుండా ఉండేందుకు స్పీడీ ఇంటర్ నెట్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

అవేర్ నెస్ పెంచుతున్నాం

ఫాస్టాగ్ విధానంపై వాహనదారుల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పటివరకు అన్ని ప్లాజాలను ఆధునీక రించినా, ఆర్​ఎఫ్​ఐడీ ఆధారంగా చెల్లింపు లు తక్కువగానే ఉన్నాయి. రానున్న రోజుల్లో వాహనాలన్నిం టికి ఆర్ఎఫ్ఐడీ అమర్చుకునేలా ప్రచారం చేస్తాం.  క్యూ లైన్లలో ఎదురుచూడడం తప్పుతుంది. ఇంధనం పొదుపు అవుతుంది.

– బీఎల్ఎన్ రెడ్డి, గ్రోత్ కారిడార్ సీజీఎం