బొగ్గు గని కార్మికులకు  పండుగ అడ్వాన్స్ 72,500

బొగ్గు గని కార్మికులకు  పండుగ అడ్వాన్స్ 72,500

గోదావరిఖని, వెలుగు: దేశ వ్యాప్తంగా కోల్‌‌ ఇండియా లిమిటెడ్(సీఐఎల్‌‌), సింగరేణి సంస్థలో పని చేస్తున్న బొగ్గు గని కార్మికులకు 2020‒21 ఆర్థిక సంవత్సరానికి గాను ఫెర్ఫార్మెన్స్‌‌ లింక్డ్‌‌ రివార్డు (పీఎల్ఆర్‌‌) బోనస్‌‌ను రూ.72,500 చెల్లించేందుకు సోమవారం రాత్రి న్యూ ఢిల్లీలో జరిగిన జేబీసీసీఐ స్టాండర్డైజేషన్‌‌ కమిటీ మీటింగ్‌‌లో నిర్ణయం తీసుకున్నారు. కోల్‌‌ ఇండియా కార్మికులకు దసరా పండుగకు ముందు, సింగరేణి కార్మికులకు దీపావళి పండుగకు ముందు ఈ బోనస్‌‌ను చెల్లిస్తారు.
6 నెలల్లో సింగరేణిలో  రూ. 11,920 కోట్ల అమ్మకాలు
మందమర్రి, వెలుగు: 2021–-22 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సింగరేణి సంస్థ రికార్డు స్థాయిలో రూ.11,920 కోట్ల బొగ్గు, పవర్​ అమ్మకాలు చేసిందని, ఇది గత ఏడాది కన్నా 67శాతం ఎక్కువని సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్​ అన్నారు. సోమవారం ఆయన సింగరేణి ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా  రివ్యూ మీటింగ్ ​నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లోని సుమారు​15 పెద్ద థర్మల్​పవర్​ కేంద్రాల నుంచి సింగరేణి బొగ్గుకు డిమాండ్​ ఉందన్నారు. డిమాండ్​ నేపథ్యంలో అక్టోబరులో  రోజూ కనీసం 1.9 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, అదే పరిమాణంలో బొగ్గు రవాణా చేయాలని, 13 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగించాలని ఆదేశించారు. ఇకపై ఏరియాల జనరల్ మేనేజర్లు  బొగ్గు ఉత్పత్తి, రవాణాపైనే పూర్తి దృష్టి సారించాలని స్పష్టం చేశారు.