బ్యాంకుల నుంచి ఆఫర్ల వాన

బ్యాంకుల నుంచి ఆఫర్ల వాన
  • ఫెస్టివల్‌‌ సీజన్‌‌ను సొమ్ము చేసుకునేందుకే..
  • వడ్డీలపై తగ్గింపులు.. ప్రాసెసింగ్ ఫీజులు మాఫీ

బిజినెస్ డెస్క్‌‌, వెలుగు: కరోనా ఎఫెక్ట్‌‌ కారణంగా నిన్నమొన్నటి దాకా నిస్తేజంగా ఉన్న బిజినెస్‌‌ను లేపడానికి బ్యాంకులు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. దేశమంతటా పూర్తిగా అన్‌‌లాక్ కావడం, ఫెస్టివల్ సీజన్‌‌ కూడా దగ్గరపడుతుండటంతో ఇవి ఆఫర్ల వరదను పారిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచగా, మరికొన్ని సీనియర్‌‌ సిటిజన్లకు ప్రత్యేక వడ్డీ రేట్లు అమలు చేస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్నాయి. హోంలోన్లపై తక్కువ వడ్డీ రేట్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే, ఆటోమొబైల్‌‌ కంపెనీలు కూడా బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకొని కస్టమర్లకు ఫైనాన్స్‌‌ ఆఫర్స్ ఇస్తున్నాయి. తాజాగా బ్యాంక్‌‌ ఆఫ్‌‌ మహారాష్ట్ర టాటా మోటార్స్‌‌తో చేతులు కలిపింది. 

స్టేట్‌‌ బ్యాంక్‌‌
స్టేట్‌‌ బ్యాంక్‌‌ హోంలోన్లపై ప్రాసెసింగ్ ఫీజు తొలగించింది. వెహికల్‌‌ లోన్లకూ  ప్రాసెసింగ్ ఫీజుపై 100 శాతం మినహాయింపు ప్రకటించింది.  కారు లోన్లపై 90శాతం వరకు ఆన్-రోడ్ ఫైనాన్సింగ్ ఇస్తున్నది. స్టేట్ బ్యాంక్ యోనో యాప్‌‌ ద్వారా కార్ లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే 25 బీపీఎస్ (బేసిస్​ పాయింట్లు) మేర వడ్డీ తగ్గుతుంది. ఫలితంగా 7.5శాతం వడ్డీ రేటుతో లోన్ పొందవచ్చు. గోల్డ్ లోన్ కస్టమర్లకు వడ్డీ రేట్లను75 బీపీఎస్ వరకు తగ్గించింది. ఈ సెగ్మెంట్‌‌ కస్టమర్లు కూడా 7.5 శాతం రేటుకు లోన్‌‌ పొందవచ్చు. యోనో ద్వారా అప్లై చేస్తే ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉండదు. పర్సనల్‌‌ & పెన్షన్ లోన్ కస్టమర్లకు లోన్‌‌ ప్రాసెసింగ్ ఫీజులో 100 శాతం మాఫీ చేస్తారు.  కోవిడ్ వారియర్లు అయితే అదనంగా 50 బీపీఎస్‌‌ల మేర ప్రత్యేక వడ్డీ రాయితీ పొందవచ్చు.  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌‌ సందర్భంగా ఈ బ్యాంక్‌‌ ‘ప్లాటినమ్‌‌ టర్మ్ డిపాజిట్ల’ను ప్రవేశపెట్టింది.  75 రోజులు, 75 వారాలు,  75 నెలల గడువున్న  డిపాజిట్లపై 15 బీపీఎస్‌‌ల వరకు అదనపు వడ్డీ ప్రయోజనాన్ని పొందవచ్చు.   

ఐసీఐసీఐ బ్యాంక్ 
ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌‌డీ స్కీమ్ ను ప్రకటించింది. సీనియర్‌‌ సిటిజన్లకు -80 బీపీఎస్‌‌ మేర ఎక్కువ వడ్డీ రేటును అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్ ఎఫ్‌‌డీ కస్టమర్లు ఏడాదికి 6.30శాతం వడ్డీ పొందవచ్చు. మొబైల్స్‌‌, ఎలక్ట్రానిక్స్‌‌, హోం అప్లియెన్సెస్‌‌ను ఐసీఐసీఐ కార్డుల ద్వారా కొంటే అదనంగా డిస్కౌంట్‌‌ పొందవచ్చు. ఇందుకోసం అమెజాన్‌‌, అజియో, బిగ్‌‌బాస్కెట్‌‌, రిలయన్స్‌‌, టాటా క్లిక్‌‌తో ఒప్పందాలను కుదుర్చుకుంది. అర్హులైన కస్టమర్లకు పర్సనల్‌‌, వెడ్డింగ్‌‌ లోన్లను నిమిషాల్లోనే ఇస్తోంది. కార్‌‌, పర్సనల్‌‌ లోన్లకు ఇన్‌‌స్టంట్‌‌ అప్రూవల్స్‌‌ ఇస్తున్నట్టు బ్యాంక్‌‌ ప్రకటించింది.

హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ 
సీనియర్ సిటిజన్ల కోసం హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ ప్రత్యేక ఎఫ్‌‌డీ పథకాన్ని తీసుకొచ్చింది. దీనిని సీనియర్ సిటిజన్ కేర్ అంటారు. ఈ డిపాజిట్లపై 75 బీపీఎస్‌‌ మేర అధిక వడ్డీ రేటు ఉంటుంది. ఫలితంగా 6.25 శాతం వడ్డీ పొందవచ్చు. అర్హులైన వారికి పది సెకన్లలో రూ.40 లక్షల వరకు పర్సనల్‌‌ లోన్​ ఇస్తోంది. ప్రతి లక్షకు నెలకు రూ.2,149 చొప్పున కిస్తీ కడితే చాలు. కార్‌‌ లోన్లపై జీరో ఫోర్‌‌క్లోజర్‌‌ చార్జీల ఆఫర్‌‌ సైతం ఉంది. కావాలంటే టాప్ అప్‌‌ లోన్లు తీసుకోవచ్చు. తన స్మార్ట్‌‌బై యాప్‌‌/వెబ్‌‌సైట్‌‌, పేజ్‌‌యాప్‌‌ ద్వారా అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌లలో ప్రొడక్టులు కొంటే పది రెట్ల రివార్డు పాయింట్లు ఇస్తోంది. ఇండిపెండెన్స్‌‌ డేను పురస్కరించుకొని క్రెడిట్‌‌కార్డు లోన్లపై ప్రాసెసింగ్‌‌ ఫీజు మాఫీ చేసింది. కార్‌‌ లోన్లపై కేవలం లక్షకు కేవలం రూ.899 చొప్పున కిస్తీ చెల్లించవచ్చని తెలిపింది. 

బ్యాంక్ ఆఫ్ బరోడా 
బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై 100 బీపీఎస్‌‌ల వరకు అదనంగా వడ్డీ ఇస్తోంది.  వీళ్లు తమ ఎఫ్‌‌డీలపై (ఐదేళ్ల నుండి ఐదేళ్ల కాలపరిమితి) 6.25శాతం వడ్డీరేటు పొందవచ్చు. సాధారణ కస్టమర్లకు 10.50 శాతం వడ్డీకి పర్సనల్‌‌ లోన్లు ఇస్తోంది. లోన్​ను ఫోర్‌‌క్లోజ్‌‌ చేసినా చార్జీలు ఏమీ తీసుకోవడం లేదు.  ఐపీఓలో ఇన్వెస్ట్‌‌ చేయాలనుకునే వారికి కూడా లోన్లు ఇస్తామని ఈ బ్యాంకు పేర్కొంది. ఈ నెల 18 నుంచి నిర్వహించే మెగా ఆక్షన్‌‌ ద్వారా వేలాది ప్రాపర్టీలను తక్కువ ధరకు దక్కించుకోవచ్చని తెలిపింది. వీటిలో ఇండ్లు, ఫ్లాట్లు, ఆఫీసులు, భూములు ఉన్నాయి. కార్‌‌ లోన్లపైనా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి.

ఈసారి బిజినెస్‌‌ బాగుంటుందని అనుకుంటున్నాం

ఈసారి ఫెస్టివల్ బిజినెస్‌‌ బాగుంటుందని అనుకుంటున్నాం. అన్ని సెగ్మెంట్లలో రిటైల్‌‌ కస్టమర్లకు ఆఫర్లు ఇస్తున్నాం. దీనివల్ల వారికి ఎంతో డబ్బు ఆదా అవుతుంది. సీనియర్‌‌ సిటిజన్లు తమ ఎఫ్‌‌డీలపై ఎక్కువ వడ్డీ పొందవచ్చు. కస్టమర్ల అవసరాలను తీర్చడంలో సాయం చేయడానికి మా బ్యాంకు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది.
- సీఎస్ శెట్టి, ఎండీ (రిటైల్‌‌, డిజిటల్‌‌ బ్యాంకింగ్‌‌) స్టేట్‌‌ బ్యాంక్‌‌