కేసీఆర్ - మోడీలది ఫెవికాల్ బంధం

 కేసీఆర్ - మోడీలది ఫెవికాల్ బంధం
  • యూపీలో ఎంఐఎం ఎన్ని సీట్లలో పోటీ చేయాలో కేసీఆర్  అమిత్ షాతో చర్చించారు
  • బండి సంజయ్ మోకాలి చిప్పలు అరిగిపోతాయి
  • ఈటల రాజేందర్, బండి సంజయ్ ఇద్దరూ బందీఖానాలో బందీ అయ్యారు: రేవంత్ రెడ్డి

ఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీలది ఫెవికాల్ బంధమని.. వీరిద్దరూ కలసి ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా మాట్లాడుకున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈటల రాజేందర్, బండి సంజయ్ ఇద్దరూ బందీఖానాలో బందీ అయ్యారని, వీరి మధ్యలో బండి సంజయ్ మోకాలి చిప్పలు అరిగిపోతాయని ఆయన ఎద్దేవా చేశారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కలసి సోనియా, రాహుల్ గాంధీలను కలసి చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొత్త పి సి సి కమిటీ ఎన్నిక చేసినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యకలాపాలపై చర్చించి వారి నుంచి సూచనలు తీసుకున్నామని తెలిపారు. 
తెలంగాణ ఆకాంక్షను ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది
అనేక రాజకీయ పరిణామాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, కానీ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ఇప్పుడున్న ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజల్ని చీకట్లో నెట్టేసిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యార్థులు, రైతులు, మహిళలు, గిరిజనులు దళితులు ,ఉద్యోగులు,  అందరూ అసంతృప్తిగా ఉన్నారని, సమస్యలన్నిటిపైనా ఒక కార్యాచరణ రాష్ట్ర కమిటీ చేపట్టిందన్నారు. అందులో భాగంగానే దళిత గిరిజన సభ కార్యక్రమాలు చేపట్టామన్నారు. నిరుద్యోగులను మోసం చేస్తున్న వైనంతోపాటు, ప్రాజెక్టుల్లో అవినీతిపై రాహుల్ గాంధీతో చర్చించమని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి మూడు నెలలకొకసారి రాష్ట్రంలో పర్యటించాలని రాహుల్ గాంధీని కోరామని తెలిపారు. 
డిసెంబర్ 9 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు
డిసెంబర్ 9 నుంచి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దీనికి రాహుల్ గాంధీని ఆహ్వానిస్తే.. తప్పకుండా వస్తాం అని చెప్పారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర కాంగ్రెస్ పార్టీ పర్యవేక్షణలో రాష్ట్ర నాయకత్వం ముందుకు వెళుతుందని ఆయన వివరించారు. రాహుల్ గాంధీ సూచనల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ  ముందుకు వెళ్తుందన్నారు. తెలంగాణకు పెద్ద సమస్య కల్వకుంట్ల కుటుంబమేనని, కేసీఆర్ , కేటీఆర్ విచక్షణ కోల్పోయి మాట్లాతున్నారు, వారి మానసిక స్థితి బాగాలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ –అమిత్ షా చర్చలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టిఆర్ఎస్ పార్టీ కి ఢిల్లీలో స్థలం కేటాయించే బదులు అమరవీరుల స్థూపాలకు స్థలం కేటాయిస్తే బాగుండేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎలక్షన్స్ లక్ష్యం గా ఢిల్లీలో కేసీఆర్ అమిత్ షా ల మధ్య చర్చలు సాగాయని ఆయన ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేయాలో, అక్కడ సీఎం యోగిని ఏవిధంగా గెలిపించాలి అనే విషయంపైనే ప్రధానితో చర్చించారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈటల రాజేందర్ బండి సంజయ్ ఇద్దరూ బందీఖానాలో బందీ అయిపోయారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన మంత్రి మోడీలది ఫెవికాల్ బంధమని.. ఈ బంధం మధ్యలో బండి సంజయ్ మోకాలి చిప్పలు అరిగిపోతాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.