రూ.1,624 కోట్లకు చేరిన ఫ్లిప్‌‌కార్ట్‌‌ నష్టాలు

రూ.1,624 కోట్లకు చేరిన ఫ్లిప్‌‌కార్ట్‌‌ నష్టాలు

బెంగళూరు: ప్రముఖ ఈ–కామర్స్‌‌ కంపెనీ ఫ్లిప్‌‌కార్ట్‌‌ నష్టాలు మార్చి 31, 2019తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 40 శాతం పెరిగి రూ.1,624 కోట్లకు చేరుకున్నాయని కంపెనీ యాన్యువల్‌‌ రిపోర్ట్‌‌ ద్వారా వెల్లడయింది. అయితే కంపెనీ నిర్వహణ ఆదాయం 51 శాతం పెరిగిందని పేపర్‌‌.వీసీ అనే డేటా ఇంటెలిజెన్స్‌‌ ప్లాట్‌‌ఫారం తెలిపింది. అమెరికాకు చెందిన రిటైల్‌‌ కంపెనీ వాల్‌‌మార్ట్‌‌ గత ఏడాది ఆగస్టులో ఫ్లిప్‌‌కార్ట్‌‌లో 77 శాతం వాటా కొన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం 16 బిలియన్‌‌ డాలర్లు చెల్లించింది.

కంపెనీ అభివృద్ధి కోసం వాల్‌‌మార్ట్‌‌ భారీ ఎత్తున ఇన్వెస్ట్‌‌ చేసినట్టు తెలుస్తోంది. అయితే, మార్కెట్‌‌ప్లేస్‌‌ సర్వీసుల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్‌‌కార్ట్‌‌ రూ.1,983 కోట్లు సంపాదించింది. లాజిస్టిక్‌‌ చార్జీలకు రూ.996 కోట్లు చెల్లించింది. ప్రమోషన్ల వ్యయాలు రెండింతలు పెరిగి రూ.576 కోట్లుగా రికార్డయ్యాయి. జీతాలు, ఈఎస్‌‌ఓపీలు 2018తో పోలిస్తే 2019లో 91 శాతం పెరిగి రూ.1,889 కోట్లకు చేరాయి.