ఢీకొట్టి పారిపోతే పట్టుబడతారు

ఢీకొట్టి పారిపోతే పట్టుబడతారు

కేపీహెచ్ బీ కాలనీకి చెందిన రమేష్ అర్ధరాత్రి సమయంలో ద్విచక్రవాహనంపై హైటెక్​సిటీ వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టి వెళ్లింది. ఈ ప్రమాదంలో రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన, వ్యక్తిని పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇలాంటి హిట్అండ్ రన్ కేసులు సైబరాబాద్​ కమిషనరేట్ పరిధిలో పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. దీంతో వాటిని ఛేదించేందుకు సైబరాబాద్​ పోలీసులు ప్రత్యేకంగా ‘రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్ మానిటరింగ్ సెల్’ను ఏర్పాటు చేశారు. కమిషనరేట్​పరిధిలో జరిగే రోడ్డు ప్రమాదాలు, కారణమైన వ్యక్తులను పట్టుకోవడంలో ఈ సెల్ ఎంతో ఉపయోగపడుతోంది. ప్రారంభించిన రెండు నెలల్లోనే మంచి ఫలితాలు వచ్చాయి.

మార్చి 6వ తేదీన సైబరాబాద్​కమిషనరేట్ లో ఏర్పాటుచేసి ఈ సెల్​ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ట్రాఫిక్​ఇన్​స్పెక్టర్ ఎండీ వహిదుద్దీన్  నాయకత్వం వహిస్తారు. ట్రాఫిక్​ఎస్ఐ వీరబ్రహ్మం, ఏఎస్ఐ శ్రీనివాస్​రావు, సిబ్బంది రామిరెడ్డి, సివ్య, అనిల్​కుమార్​టీంలో సభ్యులుగా ఉన్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్​ఈ టీంను గైడ్​చేస్తుంటారు. ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 2 నెలల్లో 6 హిట్​అండ్​రన్​ కేసులు, 6 రోడ్డు ప్రమాదాల కేసులను చేధించారు.

ఇన్వేస్టిగేషన్ చేసే ప్రాసెస్​…

రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలియగానే ఈ సెల్​లోని సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తారు. అనంత రం చుట్టు పక్కలున్న సీసీ కెమెరాలలో నమోదైన ఫుటేజీలని పరిశీలించి ఆధారాలు సేకరిస్తారు. మృతుల బంధవులు, చుట్టు పక్కల వారిని అడిగి ప్రమాదం తీరును తెలుసుకుంటారు. గ్రూప్​లో పనిచేసే అధికారుల కోఆర్డినేషన్​తోపాటు సంబంధిత పీఎస్​లోని అధికారులను సమన్వయం చేసుకొని కేసును దర్యాప్తు చేస్తారు.

సెల్​ ఛేదించిన కేసులు కొన్ని..

సైబరాబాద్​కమిషనరేట్ పరిధిలోని కేపీహెచ్​బీ పోలీస్ స్టేషన్ లో  మార్చి–19న గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ మహిళకు తీవ్ర గాయాలైనట్లు కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. రాత్రి 9.15 గంటల ప్రాంతంలో వి.మహేశ్వరి తన ద్విచక్ర వాహనంపై జేఎన్​టీయూ నుంచి మియాపూర్​ వైపు వెళ్తుంది. హైదర్​నగర్​తరుణి షాపు వద్దకు చేరుకోగానే వెనుక నుంచి గుర్తుతెలియని బస్సు ఢీకొట్టి వెళ్లింది. ఈ ప్రమాదంలో  మహేశ్వరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్ టీఏ సెల్ సభ్యులు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. జరిగిన ప్రదేశంలో ఎలాంటి సీసీ కెమెరాలు లేవు. ప్రమాదం జరిగిన సమయంలో స్థానికంగా ఉన్నవారిని అడగ్గా పసుపు రంగు బస్సు ఢీకొట్టి వెళ్లినట్లు చెప్పారు. అనంతరం ప్రగతినగర్ యూ టర్న్,  జేన్​టీయూ, రెమిడీ ఆసుపత్రి దగ్గరున్న యూటర్న్​ల వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో హైదరాబాద్ నుంచి కర్ణాటకకు వెళ్లే కర్ణాటకకు చెందిన బస్సు కనిపించింది. బస్సుపై కన్నడ భాషలో ఐరావత్​ అని రాసి ఉండడం, బస్సు నెంబర్ ప్లేట్​ సరిగ్గా కనిపించకపోవడంతో హైదరాబాద్​ నుంచి కర్ణాటకకు వెళ్లే రహదారిలో ఉన్న టోల్​ ప్లాజాలలో తనీఖీలు చేశారు. జహీరాబాద్​లోని  కాన్​కోల్ టోల్​ ప్లాజా వద్ద బస్సు ఆచూకీ లభించింది.

మే 6వ తేదీన మహ్మద్​ ఖాన్(67) వట్టేపల్లిలోని ఫయాజ్​స్కూల్​ వద్ద ఉన్న మసీదులో నమాజ్​ చేసేందుకు ఉదయం 5.15 గంటలకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇదే సమయంలో మహ్మద్ ఖాన్​ను వెనుక నుంచి గుర్తుతెలియని కారు బలంగా ఢీకొట్టింది. ఖాన్​అక్కడికక్కడే మృతిచెందాడు. ఆర్​టీఏ సెల్​సభ్యులు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకొని పక్కనే ఉన్న ఫయాజ్​స్కూల్​లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ ఫుటేజీలో వాహనం క్లారిటీగా కనబడలేదు. దీంతో ఫలక్​నుమా వైపు ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా ప్రమాదం జరిగిన తీరును గమనించారు. పక్కాగా ప్లాన్ చేసి చంపినట్లు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన ప్రవీణ్​, జావీద్, తజముల్ భాయ్​లను అరెస్ట్​ చేసి రిమాండ్​కు పంపించారు. వీటితో పాటు రోడ్డు ప్రమాదాల తీరుపై రోడ్డు ట్రాఫిక్ ఆక్సిడెంట్ సెల్​ ప్రత్యేకంగా పరిశీలించి ప్రమాద తీరు, ప్రమాదానికి కారణమైన వాహనం, సీసీ ఫుటేజీల అధారంగా కేసులను ఛేదించింది ఆర్ టీఏ సెల్.   కమిషనరేట్​ పరిధిలో జరిగిన ఆరు ప్రమాదాల్లో ఆరుగురు వ్యక్తులు చనిపోయారు. ఈ కేసులను దర్యాప్తు చేయడంలో ఆర్ టీఏ కీలకంగా వ్యవహరించింది.