న్యాయ వ్యవస్థ.. రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీ

న్యాయ వ్యవస్థ.. రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీ
  • ప్రభుత్వ చర్యలను న్యాయ వ్యవస్థ సమర్థించాలని అధికార పార్టీలు భావిస్తున్నాయి
  • రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతలపై అవగాహన కల్పించాలి
  • సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ

న్యూఢిల్లీ : మన దేశంలో న్యాయ వ్యవస్థ.. రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తీసుకునే తమ ప్రతీ చర్యను న్యాయ వ్యవస్థ సమర్థించాలని భావిస్తాయని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు తాము రాజకీయంగా ముందుకెళ్లేందుకు న్యాయ వ్యవస్థ సహకరిస్తుందని అనుకుంటాయని తెలిపారు. కానీ న్యాయ వ్యవస్థ రాజ్యాంగానికే జవాబుదారీగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన అసోసియేషన్​ ఆఫ్​ ఇండియన్​ అమెరికన్స్​ సంస్థ శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన తర్వాత కూడా ప్రతి వ్యవస్థకు ఏ బాధ్యతలు, ఏ పాత్రను రాజ్యాంగం అప్పగించిందనే విషయంపై చాలా మందికి అవగాహన లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని ఇంకా గుర్తించడం లేదన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించే శక్తులు న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో నిర్లక్ష్యాన్ని పెంచుతున్నాయన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య సంస్థల పనితీరు గురించి ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడంతో ఈ లోపభూయిష్ట ఆలోచన అభివృద్ధి చెందుతోందని చెప్పారు. దేశంలో రాజ్యాంగ పరమైన సంస్కృతిని పెంచాలని, వ్యవస్థలో ఎవరి బాధ్యత ఏమిటన్న దానిపై అవగాహనను కల్పించాలని స్పష్టం చేశారు.