జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ కు సీబీఐ నోటీసులు

జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ కు సీబీఐ నోటీసులు

జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ అవినీతి ఆరోపణల కేసులో ఏప్రిల్ 28న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. మాలిక్ ను సాక్షిగా విచారణకు రావాలని సూచించింది. దీంతో మాలిక్ విచారణకు హాజరు కావాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది.

 సత్యపాల్ మాలిక్ 2018లో జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా ఉన్నప్పుడు పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన కంపెనీ ఒప్పందాన్ని రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు సంబంధించిన మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ కు సంబంధించిన స్కామ్ ఇది.  దాదాపు 3.5 లక్షల మంది ఉద్యోగులు ఈ పథకంలో జాయిన్ అయ్యారు. అయితే ఇందులో అవకతవకలు జరిగాయని అప్పుడు గవర్నర్ గా ఉన్న   సత్యపాల్ మాలిక్ ఒక్క నెలలోనే ఈ కాంట్రాక్ట్ ను  రద్దు చేశారు. ఈ కేసులో   రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో పాటు ట్రినిటీ రీఇన్స్యూరెన్స్ బ్రోకర్లను సీబీఐ నిందితులుగా పేర్కొంది.

ఈ కాంట్రాక్ట్ లో  అవినీతి జరిగిందని  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి కాంట్రాక్ట్ ను రద్దు చేయాలని తనను కోరారని మాలిక్ చెప్పారు. దీంతో  తానే స్వయంగా కాంట్రాక్ట్ కు సంబధించిన   ఫైల్ ను పరిశీలించి రద్దు చేశానని తెలిపారు. ఈ క్రమంలోనే అదనపు సమాచారం  కోసం మాలిక్ ను సీబీఐ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.