జార్ఖండ్​ ఎంపీ ఇంట్లో 220 కోట్లు.. బీరువాల్లో బయటపడ్డ నోట్ల కట్టలు

జార్ఖండ్​ ఎంపీ ఇంట్లో 220 కోట్లు..  బీరువాల్లో బయటపడ్డ నోట్ల కట్టలు
  • కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు కంపెనీలు, ఇండ్లలో ఐటీ రెయిడ్స్
  • బీరువాల్లో బయటపడ్డ నోట్ల కట్టలు.. పది మెషిన్లతో లెక్కింపు

భువనేశ్వర్/రాంచీ: బిజినెస్ మెన్, కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన బౌధ్ డిస్టిలరీ గ్రూప్​పై ఐటీ శాఖ చేస్తున్న దాడులు శుక్రవారం మూడో రోజూ కొనసాగాయి. ఈ గ్రూప్ కంపెనీలు, సాహుకు చెందిన ఇండ్లు, ఆఫీసులు, బంధువుల కంపెనీలు, ఇండ్లలోనూ సోదాలు జరిగాయి. ఇప్పటి వరకు రూ.220 కోట్లు స్వాధీనం చేసుకున్నామని ఐటీ వర్గాలు శుక్రవారం పేర్కొన్నాయి. ఇంకా 150 బ్యాగుల సొమ్ము లెక్కించాలని తెలిపాయి. 

‘‘శుక్రవారం బోలంగీర్ జిల్లాలోని సుడపడలో 156 బ్యాగుల క్యాష్ స్వాధీనం చేసుకున్నాం. పది కౌంటింగ్ మెషిన్లతో లెక్కిస్తున్నాం. ఇప్పటి వరకు ఆరేడు బ్యాగులు లెక్కించగా, అది రూ.20 కోట్లు అని తేలింది” అని చెప్పాయి. ఒడిశాలోని సంబల్​పూర్, బోలంగీర్, టిటిలాగఢ్, బౌధ్, సుందర్​గఢ్, రూర్కెలా, భువనేశ్వర్​తో పాటు జార్ఖండ్​లోని రాంచీ, బొకారో, బెంగాల్ కోల్​కతాలో తనిఖీలు చేపట్టినట్టు పేర్కొన్నాయి. కాగా, గురువారం బౌధ్ డిస్టిలరీ కంపెనీలో బీరువాల్లో రూ.వందల కోట్లను ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. 

ఎవరీ ధీరజ్ సాహు?

ధీరజ్ సాహు జార్ఖండ్​కు చెందిన బిజినెస్ మెన్. ఆయన అదే రాష్ట్రం నుంచి కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. సాహు కుటుంబం మద్యం వ్యాపారంలో ఉన్నది. వీళ్ల బౌధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్.. ఒడిశాలోనే అతిపెద్ద లిక్కర్ కంపెనీ. ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు పన్ను ఎగవేశాయనే ఆరోపణలతో ఐటీ శాఖ తనిఖీలు చేపట్టింది.