న్యూఢిల్లీ: ఈ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని విభజన, మతతత్వ ప్రసంగాలతో ఓటమిని తప్పించుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిగానే దేశ ప్రజలు గుర్తుంచుకుంటారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఎన్‌డీఏ అభ్యర్థులకు మోదీ ఇటీవల రాసిన లేఖలో ఎస్సీ, ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లను కాంగ్రెస్ తన ‘ఓటు బ్యాంకు’కు ఇస్తుందని ప్రచారం చేయాల్సిందిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా అబద్ధాలతో కాంగ్రెస్‌పై విషం చిమ్మారని మండిపడుతూ ఖర్గే గురువారం మోదీకి లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, యువత, కార్మిక వర్గం ఇలా భారతీయులంతా తమ ఓటు బ్యాంకేనని పేర్కొన్నారు. తన పదేండ్ల పాలనపై చర్చ జరగకుండా మోదీ ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 1947 నుంచి ప్రతి సందర్భంలో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నాయన్నారు. జనాభా ప్రాతిపాదికన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నదో మీ పార్టీ చెప్పాలని ప్రశ్నించారు.
విద్వేషాన్ని స్ప్రెడ్ చేయమంటున్నరు
‘‘ఓటర్లకు ఏంచెప్పాలో సూచిస్తూ ఎన్‌డీఏ అభ్యర్థులకు మీరు రాసిన లేఖను నేను చూశా. మీరు చాలా నిరాశ, టెన్షన్లో ఉన్నట్లు అందులో పేర్కొన్న కంటెంట్ చూస్తే అర్థమవుతోంది. ప్రధాని స్థాయికి ఎంత మాత్రం సరితూగని భాషను ఉపయోగించడం దీన్ని స్పష్టం చేస్తున్నది. రోజూ మీరు ప్రచారం చేస్తున్న అబద్ధాలను, విద్వేషాన్ని స్ప్రెడ్ చేయాల్సిందిగా మీ అభ్యర్థులకు సూచిస్తున్నారు. వెయ్యి సార్లు చెప్పినంత మాత్రాన అబద్ధం నిజం కాబోదు” అని ఖర్గే చెప్పారు.
చైనాకు క్లీన్ చిట్ ఇచ్చారు
‘‘కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందని మీరు, హోంమంత్రి విమర్శిస్తున్నరు. కానీ గత పదేళ్లుగా దేశ ప్రజలు చూస్తున్న ఒకే ఒక్క బుజ్జగింపు విధానం మీరూ, మీ మంత్రులూ చైనీయులను బుజ్జగించడమే. మీరు ఇప్పటికీ చైనాను చొరబాటు దారుగా పేర్కొనే ధైర్యం చేయడం లేదు. ‘‘ఎవరూ చొరబడలేదు.. ఎవరూ చొరబడలేరు” అనే మాటలు చెప్తూ గాల్వాన్ లోయలో 20 మంది భారత సైనికుల ప్రాణ త్యాగాన్ని అవమానించారు. చైనా క్లీన్ చిట్ ఇచ్చారు” అని ఖర్గే ఆరోపించారు.
