న్యూఢిల్లీ: దైవదూషణకు పాల్పడ్డాడంటూ బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్ జిల్లాలో దీపు చంద్ర దాస్ అనే హిందు వ్యక్తిని అల్లరి మూక దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీపు చంద్ర దాస్ హత్యపై అతని సోదరుడు అపు దాస్ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. తన సోదరుడు దైవదూషణకు పాల్పడ్డాడన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశాడు. దీపు దాస్ ఒక వర్గాన్ని కించపర్చే వ్యాఖ్యలు చేసే వ్యక్తి కాదని.. అతడు అలాంటి వ్యాఖ్యలు చేశాడంటే మేం అస్సలు నమ్మమన్నాడు.
ఈ ఘటన జరిగినప్పుడు మా ఫ్యామిలీ అంతా ఇంట్లోనే ఉందని.. దీపు రోజు మాదిరిగానే పనికి వెళ్లాడని చెప్పాడు. సోషల్ మీడియాలో చూసిన తర్వాతే తమకు ఈ విషయం తెలిసిందన్నారు. తన సోదరుడిని దారుణంగా హత్య చేసిన నిందితులకు ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశాడు. నిందితులను ఉరి తీస్తేనే మాకు శాంతి కలుగుతుందన్నాడు. తన సోదరుడి హత్య తర్వాత చాలా మంది మా ఇంటికి వచ్చి పరామర్శించి ధైర్యం చెప్పి వెళ్తున్నారని.. కానీ మమ్మల్ని విడిచి వెళ్లిన మా సోదరుడిని ఎవరూ తిరిగి తీసుకురాలేరని ఎమోషనల్ అయ్యాడు.
కాగా, మైమెన్‌సింగ్ సిటీలోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న దీపూ చంద్ర దాస్.. మహ్మద్ ప్రవక్తను దూషించాడంటూ అల్లరిమూక కొట్టి చంపి, తగులబెట్టిన ఘటన బంగ్లాదేశ్‌లో సంచలనం రేపింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కలిక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీపూ చంద్ర దాస్ ఇస్లాంకు వ్యతిరేకంగా కామెంట్లు చేసినట్టు ఎలాంటి ఆధారాలులేవని బంగ్లాదేశ్ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ కమాండర్ ఒకరు వెల్లడించారు.
