
అమేథీ, రాయ్‌బరేలి స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ వీడింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగనున్నట్లు ఏఐసీసీ ప్రకటించింది. అమేథీ నుంచి కిషోరీలాల్ శర్మ పోటీ చేయనున్నట్లు తెలిపింది. వీరిద్దరు ఈరోజు నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేసిన సంగతి తెలిసిందే.
అమేథీ, రాయ్‌బరేలి నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగియనుంది. మే 20న ఓటింగ్ జరగనుంది. కాగా రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీపై బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ పోటీ చేయనున్నారు. ఇక అమేథీలో కిషోరీలాల్ శర్మ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై పోటీ చేస్తున్నారు. కిషోరి లాల్ శర్మ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు . రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమానికి సోనియా గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. కిషోరీ లాల్ శర్మ నామినేషన్ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ వాద్రా హాజరు కానున్నారు.
రాయ్‌బరేలీ, అమేథీ రెండూ కాంగ్రెస్‌కు కంచుకోటలు.. రాహుల్ గాంధీ 2004, 2009, 2014లో అమేథీ నుంచి గెలువగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఆ సీటును బీజేపీ నుంచి కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. ఇక ఈసారి కూడా ప్రియాంక గాంధీ పోటీ చేయకుండా ప్రచారం చేయనున్నారు. పార్టీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రియాంక గాంధీ పోటీ చేయడానికి సిద్ధంగా లేనని, పార్టీ తరుపునే ప్రచారం చేయాలని ఫిక్స్ అయ్యారు.