త్వరలో హైడ్రాకు ఫైర్ సేఫ్టీ సీజ్ పవర్స్.. ఇప్పటివరకు జీహెచ్ఎంసీకి ఉన్న అధికారం

 త్వరలో హైడ్రాకు  ఫైర్ సేఫ్టీ సీజ్ పవర్స్.. ఇప్పటివరకు జీహెచ్ఎంసీకి ఉన్న అధికారం
  • ఇటీవల హైడ్రాతో కలిసి చర్యలు
  • తమకూ అధికారాలు కావాలని ప్రభుత్వానికి హైడ్రా లేఖ
  • త్వరలో అనుమతి ఇచ్చే ఛాన్స్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫైర్ సేఫ్టీ లేని బిల్డింగులను సీజ్ చేసే బాధ్యతలను త్వరలో హైడ్రాకు ఇవ్వనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ పనిని జీహెచ్ఎంసీ చూస్తోంది. ఇటీవల ఫైర్ సేఫ్టీ పాటించని భవనాలను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా సీజ్ చేసింది. అయితే ఫైర్ సేఫ్టీకి సంబంధించి పూర్తి బాధ్యతలు హైడ్రాకు ఉన్నాయి. ఫైర్ ఎన్ఓసీలకి సంబంధించి 18 మీటర్ల లోపు ఎత్తు ఉన్న బిల్డింగులకు అయితే హైడ్రా, అంతకు మించి అయితే ఫైర్ డిపార్టుమెంట్లు  జారీ చేస్తున్నాయి. అలాగే ఫైర్ జరిగిన సమయంలోనూ ఈ విభాగాలే కీలకంగా వ్యవహిరిస్తున్నాయి. కానీ, ఫైర్ సేఫ్టీ లేకపోతే సీజ్ చేసే పవర్స్ తమకు కూడా ఇవ్వాలని హైడ్రా ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది.

వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండటం, నివారణకు తమకు సీజ్ చేసే బాధ్యతలు ఇవ్వాలని  కోరింది. ప్రభుత్వం కూడా ఈ అంశంపై సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. త్వరలో సీజ్ చేసే బాధ్యతలను అప్పగిచే అవకాశముంది. జీహెచ్ఎంసీ ఓఆర్ఆర్ వరకు విస్తరించడం, అక్కడి వరకు హైడ్రా పరిధి ఉండటంతో సీజ్ చేసే అధికారాలు హైడ్రాకు ఇస్తే ఫైర్ యాక్సిడెంట్లు నివారించే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ విషయంపై త్వరలో క్లారిటీ వచ్చే  ఛాన్స్ ఉంది. 

ఈ నెలాఖరు వరకు అవగాహన కార్యక్రమాలు..

న‌గ‌రంలో అగ్ని ప్రమాదాల నివార‌ణ‌కు సంబంధించి హైడ్రా అవ‌గాహ‌న కార్యక్రమాల‌ను ప్రారంభించింది. ఈ నెలాఖరు వరకు ఈ ప్రొగ్రాం నిర్వహించనుంది.  అగ్ని ప్రమాదాలు జ‌ర‌గ‌కుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, ఒక వేళ అగ్ని ప్రమాదం జ‌రిగితే ఎలా మంట‌ల‌ను అదుపులోకి తీసుకురావాలని,  ప్రాణ‌, ఆస్తి న‌ష్టాల‌ను నివారించే విధానాల‌ను అధికారులు, సిబ్బంది సూచిస్తున్నారు. ఫైర్ ఎక్ట్సింగ్విష‌ర్లు వినియోగించ‌డం,  మంట‌ల‌ను ఆర్పే వాట‌ర్ స్ప్రింక్లర్ల ప‌నితీరు, స్మోక్ డిటెక్టర్లపై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. ఇలా అవగాహన కల్పించిన అనంతరం పకడ్భందీ చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదే తరుణంలో హైడ్రాకు సీజ్ బాధ్యతలు అప్నగిస్తే అగ్నిప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది.