కోఠి కాల్పుల కేసులో కీలక పురోగతి

కోఠి కాల్పుల కేసులో కీలక పురోగతి
  • నిందితులకు షెల్టర్ ఇచ్చిన ఇల్లు గుర్తింపు
  • ఇంటి యజమాని సమాచారంతో యూపీలో గాలింపు

బషీర్​బాగ్, వెలుగు: కోఠి ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం వద్ద ఇటీవల జరిగిన కాల్పులు, దోపిడీ కేసులో హైదరాబాద్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. నగదు డిపాజిట్ చేయడానికి వచ్చిన కేరళ వ్యాపారి రిన్షీద్​పై ఇద్దరు దుండగులు నాటు తుపాకీతో కాల్పులు జరిపి నగదుతో పారిపోయిన అనంతరం పాత బస్తీ కార్వాన్‌ షాహిన్​నగర్​లోని ఓ ఇంట్లో షెల్టర్ తీసుకున్నట్లు సీపీ స్పెషల్ టాస్క్​ఫోర్స్ టీమ్ గుర్తించింది.

నిందితులకు షెల్టర్ ఇచ్చిన ఇంటి యజమానిని అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నట్లు తెలిసింది. రాబరీకి ఒక రోజు ముందు కూడా నిందితులు ఇద్దరు ఇదే ఇంట్లో ఉన్నారని, చోరీ చేసిన తర్వాత మరో రెండ్రోజులు ఇక్కడే ఉండి తర్వాత రోడ్డు మార్గంలో ఉత్తరప్రదేశ్​కు పారిపోయినట్లు సమాచారం. నిందితులిద్దరూ యూపీకి చెందిన వ్యక్తులుగా గుర్తించిన పోలీసులు, వారిలో ఒకరి స్వస్థలాన్ని గుర్తించి ఆ రాష్ట్రంలో గాలింపు చర్యలు చేపట్టారు.