మున్సిపల్ పోరు..పంపకాల జోరు!..కౌన్సిలర్ ఎన్నికల్లో విచ్చలవిడిగా నోట్ల పంపణీ

మున్సిపల్ పోరు..పంపకాల జోరు!..కౌన్సిలర్ ఎన్నికల్లో విచ్చలవిడిగా నోట్ల పంపణీ
  • ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల దాకా..
  • పైసల కోసం ఆస్తులు కుదవ పెడ్తున్న అభ్యర్థులు

ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ ఎన్నికల్లో 15వ వార్డులో అభ్యర్థులు పోటాపోటీగా ఓటర్లకు గిఫ్టులు పంచుతున్నారు. ఓ అభ్యర్థి ముందుగానే అడ్వాన్స్ గా ఓటుకు రూ.500, స్వీట్ బాక్స్ పంచగా.. మరొకరు కేజీ చికెన్, మహిళలకు కాస్ట్లీ చీరల ఆశ చూపుతున్నారు. వైరా మున్సిపాలిటీలోని 15వ వార్డులో పోటీలో ఉన్న ఒక్కో అభ్యర్థి ఖర్చు కోటిన్నర చేరొచ్చనే  ప్రచారం జరుగుతోంది.  ఈ వార్డులో ఓ అభ్యర్థి ఇంటింటికి 25 కేజీల బియ్యం పంపిణీ చేసేందుకు సిద్ధం కాగా, మరొకరు రూ.5 వేలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

కరీంనగర్​ కార్పొరేషన్ లోని ఓ వార్డులో  ప్రధాన పార్టీ అభ్యర్థి ఒకరు  ఓటుకు రూ.2వేల చొప్పున ఇప్పటికే పంపిణీ చేయగా,  మరో పార్టీ అభ్యర్థి రూ.3వేల చొప్పున పంచేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఇద్దరు అభ్యర్థులు ఓటర్లకు పంచేందుకు ఒక్కొక్కరు రూ.50 లక్షలకుపైగా ఖర్చు చేస్తున్నారు. పార్టీ నుంచి ఎలాంటి ఫండ్​రాకపోవడంతో ఒకరు తన ప్లాటును, ఇంకొకరు వ్యవసాయభూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చినట్లు చర్చ జరుగుతోంది. కాగా, తామెవరినీ  డబ్బులు అడగకున్నా బతిమిలాడి మరీ చేతిలో పెట్టిపోతున్నారని పలువురు ఓటర్లు వాపోతున్నారు.


కరీంనగర్/నెట్‌వర్క్, వెలుగు: రాష్ట్రంలో ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు తాయిళాల పంపిణీకి తెగబడుతున్నారు. కులాలవారీగా తాయిలాలు, మహిళా సంఘాలకు నగదు, ఇంటింటికీ మటన్, చికెన్, మద్యం పంపిణీ జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు కూడా పంపకాల్లో ముందుంటున్నారు. ఎన్నికల్లో ఖర్చు పెరగడంతో అభ్యర్థులు ప్లాట్లు, పొలాలు, బంగారం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు. ఒక్కో వార్డులో రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆర్థికంగా బలహీనులైన అభ్యర్థులు పోటీకి దూరమవుతున్నారు.

కరీంనగర్‌లో రూ.100 కోట్ల ఖర్చు!

కరీంనగర్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. 66 డివిజన్లలో 398 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, సుమారు 250 మంది భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. ఎంఐఎంకు ఆరేడు డివిజన్లలో వన్ సైడ్ ఓటింగ్ జరిగే అవకాశముంది. ఎంఐఎం ప్రభావిత డివిజన్లు పోగా మిగతా 60 డివిజన్లలో మూడు పార్టీల అభ్యర్థులతో పాటు చాలా చోట్ల  ఇండిపెండెంట్లుగా ఆర్థికంగా బలమైన క్యాండిడేట్లు పోటీలో ఉన్నారు. కొన్ని డివిజన్లలో ఒక్కో అభ్యర్థి రూ.50 లక్షల నుంచి రూ.కోటికి పైగా వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మొత్తం ఖర్చు రూ.100 కోట్లు దాటే అవకాశం ఉంది.

ఆస్తులు తనఖా పెట్టి ఖర్చులు..

మంచిర్యాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ సాగుతోంది. అభ్యర్థులు రూ.30 లక్షలనుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు పంపిణీ చేస్తున్నారు. చాలామంది అప్పులపై ఆధారపడుతున్నారు. కామారెడ్డిలోని పలు వార్డుల్లో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు పంచుతున్నారు. లిక్కర్​ పంపిణీ జోరుగా సాగుతోంది. కొందరు స్థలాలు అమ్ముకుని, మరికొందరు ఆస్తులు తనఖా పెట్టి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.

ములుగులో ఆయిల్ ప్యాకెట్లు, మటన్ పంపిణీ చేస్తున్నారు. ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మెదక్​లోని కొన్ని వార్డుల్లో టఫ్ ఫైట్ నడుస్తోంది. పోలింగ్ ముందు ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. కుల సంఘాల ఓట్ల కోసం ప్రత్యేక చర్చలు జరుగుతున్నాయి. యాదాద్రి జిల్లా ఆరు మునిసిపాలిటీల్లోని 104 వార్డుల్లో దాదాపు అన్ని చోట్ల ఓటుకు రూ.3 వేలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. కొందరు ఆస్తులు తనఖా పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు.

అగ్గువకు ఆస్తులు అమ్మి..

హుస్నాబాద్  లో చైర్మన్ పదవికి పోటీ పడుతున్న ఓ అభ్యర్థి ప్రచారం కోసం విపరీతంగా ఖర్చు చేస్తున్నాడు. పట్టణంలోని విలువైన ప్లాటును రూ.95 లక్షలకు అమ్ముకున్నాడు. దుబ్బాకలో మరో అభ్యర్థి సిద్దిపేటలోని ఓ అపార్మెంట్ లోని ఫ్లాట్​ను రూ.25 లక్షల అగ్గువకు తీసేశాడు.  చేర్యాల మున్సిపాల్టీలో మరో అభ్యర్థి ఓపెన్ ప్లాట్ ను కుదవ పెట్టగా  వచ్చిన రూ.15 లక్షలను పోలింగ్ ముందు రోజు పంపిణీ కోసం ముఖ్య నేత ఖాతాలో డిపాజిట్​ చేసినట్లు తెలిసింది.

రూ.5 చొప్పున వడ్డీకి అప్పులు తెచ్చి..

యాదాద్రి జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు ఉండగా, దాదాపు అన్ని చోట్ల ఓటుకు రూ 3 వేల చొప్పున పంచేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు పంపకాలు కూడా మొదలుపెట్టడంతో మిగిలినవారు పైసల వేటలో పడ్డారు.  ఈ క్రమంలో ఆస్తులు తనఖా పెడ్తున్న అభ్యర్థులు రూ. 5 చొప్పున వడ్డీకి లక్షలకు లక్షలు తెస్తున్నట్లు చెప్తున్నారు.