హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక వ్యవహారంపై గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీల ఎక్స్ అఫీషియోల ఓటింగ్ ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఓటింగ్‌లో పాల్గొనేటప్పుడు డివిజన్ బెంచ్ ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను అమలు చేయాలని తెలిపింది. వాళ్ల నియోజకవర్గాల పరిధిలోని రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉన్న మున్సిపాలిటీల్లోనే వినియోగించుకోవాలని డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు అమలు కావాలని చెప్పింది. ఎక్స్ అఫీషియో ఓటర్లను మున్సిపాలిటీ చట్టసభ్యులు ఎంచు కోవాలని పేర్కొంటూ నిర్మల్ కలెక్టర్ ప్రజాప్రతినిధులకు లేఖ రాయడంపై కె.నరేందర్ వేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు.
ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గతంలో హైకోర్టు తీర్పు ఉండగా మళ్లీ ఉత్తర్వులు కోరడం ఏమిటని ప్రశ్నించారు. తాజాగా ప్రభుత్వం ఏమైనా ఉత్తర్వులు జారీ చేస్తే పిటిషన్ వేస్తే అర్థం ఉంటుందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియోలకు ఓటింగ్ అంశంపై గతంలో డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తామని ఇచ్చిన హామీని జడ్జి రికార్డుల్లో నమోదు చేశారు. తెలంగాణ మున్సిపల్ చట్టం–2019లోని సెక్షన్–5, సెక్షన్–20 నిబంధనలను పిటిషనర్ న్యాయవాది ఉదహరించారు.
ప్రజా ప్రతినిధులు మున్సిపాలిటీ పరిధిలో ఓటరుగా నమోదు కాని వారిని ఎక్స్–అఫీషియో సభ్యులుగా పరిగణించరాదన్నారు. అలాంటి వారికి ఓటు హక్కు కల్పించడం రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. ఎక్స్–అఫీషియో సభ్యుల ఎంపిక, ఓటు హక్కుల విషయంలో చట్టం నిర్దేశించిన ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ హామీ మేరకు డివిజన్ బెంచ్ తీర్పు అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు పిటిషన్‌పై విచారణ మూసివేసింది.
