హైదరాబాద్ గాలిలో సల్ఫర్ డయాక్సైడ్... రోజుకు కిలోల కొద్దీ విడుదలవుతున్న సైలెంట్ కిల్లర్

హైదరాబాద్ గాలిలో సల్ఫర్ డయాక్సైడ్... రోజుకు కిలోల కొద్దీ విడుదలవుతున్న సైలెంట్ కిల్లర్
  • వెల్లడించిన ఐఐటీ కాన్పూర్ నివేదిక

హైదరాబాద్ గాలిలో  సల్ఫర్ డయాక్సైడ్ పరిమితికి మించి పెరుగుతున్నదని ఐఐటీ కాన్పూర్ నివేదిక వెల్లడించింది. ఈ విష వాయువు ఊపిరితిత్తులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపింది. నియంత్రించకపోతే మున్ముందు ప్రమాదమేనని పేర్కొంది.

హైదరాబాద్ సిటీ, వెలుగు: కంటికి కనిపించదు... వాసన ఉండదు.. కానీ ఊపిరి పీల్చినప్పుడల్లా చేయాల్సిన నష్టం చేసేస్తుంది. అదే సల్ఫర్ డయాక్సైడ్(ఎస్ఓ 2). ఈ ఉద్గారాల పరిమితి హైదరాబాద్​ఏరియాలో క్రమంగా పెరుగుతోంది. నియంత్రించకపోతే మున్ముందు ప్రమాదమేనని ఇటీవల విడుదలైన ఐఐటీ కాన్పూర్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్​లో సల్ఫర్ డయాక్సైడ్ కాలుష్యం ఆందోళనకరంగా పెరుగుతోందని స్పష్టం చేసింది. 

ఈ విష వాయువు ఊపిరి పీల్చినప్పుడల్లా ఊపిరితిత్తులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని తెలిపింది. రిపోర్ట్ ప్రకారం..ఔటర్ రింగ్ రోడ్డు వద్ద రోజుకు సగటున 18.101 కిలోలు రిలీజ్ అవుతుండగా..ఇందులో 92శాతం ఉద్గారాలు పారిశ్రామిక కార్యకలాపాల వల్లే విడుదలవుతున్నది. ఇక హైదరాబాద్ నగరంలో 10.701 కిలోలు రిలీజ్ అవుతుండగా.. ఇందులో 91శాతం వాహనాల (ముఖ్యంగా డీజిల్ వాహనాలు) ద్వారానే వెలువడుతున్నాయి. ఈ కాలుష్యాన్ని వెంటనే నియంత్రించకపోతే భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలు, పర్యావరణ నష్టం తప్పదని నివేదిక హెచ్చరించింది.  

ఈ వాయువు ఆమ్ల వర్షాలకు దారితీసి, నేల సారాన్ని, పంటలను దెబ్బతీస్తుందని చెప్పింది.  ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాలు, అధిక ట్రాఫిక్ ఉన్న సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఏరియాల్లో  ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.  2010–-2020 కాలంలో  కొన్ని నియంత్రణల వల్ల తగ్గుదల కనిపించినప్పటికీ తాజా అధ్యయనం మళ్లీ పెరిగినట్లు వివరించింది.