కేసీఆర్ దొంగ పాస్ పోర్టులు, దొంగనోట్ల చరిత్ర నేను చెరిపేస్తే చెరిగేదా?: సీఎం రేవంత్రెడ్డి

కేసీఆర్ దొంగ పాస్ పోర్టులు, దొంగనోట్ల చరిత్ర నేను చెరిపేస్తే చెరిగేదా?: సీఎం రేవంత్రెడ్డి
  • మీ పదేండ్ల దోపిడీ చరిత్ర గోడలపై రాయిస్త
  • దళితుడిని సీఎం చేస్తానన్న దొంగ హామీల చరిత్ర కేసీఆర్​ది
  • తెలంగాణ ఉన్నంత కాలం ఈ పాపాల భైరవుల చరిత్ర చెరిగిపోదు 
  • ఫోన్​ ట్యాపింగ్ చేస్తే నోటీసులు ఇస్తే తప్పేంటి? 
  • మీరు చేసిన అప్పులు, తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నం
  • మోదీని చూసి ఓటేస్తే నిధుల కోసం ఢిల్లీకి వెళ్లి అడగాలా? 
  • బీజేపీ వాళ్లు బీ ఫామ్​ను బీఆర్ఎస్ ఆఫీసులో తెచ్చుకుంటున్నరట 
  • కేసీఆర్ నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైంది 
  • రోజమ్మ రొయ్యల పులుసు తిని రాయలసీమకు నీళ్లిస్తామన్న 
  • కేసీఆర్ రంగారెడ్డిని మరిచిపోయిండు 
  • గోదావరి జలాలు తెచ్చి తాండూరు, పరిగి, 
  • వికారాబాద్ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తం
  • వికారాబాద్ జిల్లా పరిగిలో 'ప్రజా పాలన- ప్రగతి బాట' సభ

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్​పదేండ్ల దోపిడీ చరిత్రను గోడల మీద రాయిస్తానని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. ‘‘కేసీఆర్ దొంగ పాస్ పోర్టులు, దొంగనోట్ల చరిత్ర నేను చెరిపేస్తే చెరిగేదా? దళితుడిని సీఎం చేస్తానన్న దొంగహామీల చరిత్ర నేను చెరిపేయగలనా? ఇంటికో ఉద్యోగం ఇస్తమని 1,200 మందిని పొట్టన పెట్టుకొని వాళ్ల శవాల మీద సీఎం అయ్యి..  తెలంగాణ ద్రోహిగా మారి ఉద్యమ కారులకు చేసిన ద్రోహం నేను తుడిచేస్తే పోతదా.. తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం ఈ పాపాల భైరవుల చరిత్ర చెరిగిపోదు’’ అని రేవంత్​ విమర్శించారు.  

వికారాబాద్ జిల్లా పరిగిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శనివారం సీఎం రేవంత్​ పాల్గొన్నారు. మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా “ప్రజా పాలన- – ప్రగతి బాట” పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్​బాబు, అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​ కుమార్, శాసనమండలి విప్​ పట్నం మహేందర్​రెడ్డి,​ తదితరులు పాల్గొన్నారు.

ఫోన్​ ట్యాపింగ్ లాంటి చిల్లర పనులకు నోటీసులు ఇస్తే తప్పేంటి? 

ఫోన్​ ట్యాపింగ్​లాంటి  చిల్లర పనులు చేసిన మాజీ సీఎం కేసీఆర్​కు పోలీసులు నోటీసులు ఇస్తే తప్పేంటని సీఎం రేవంత్​ ప్రశ్నించారు. ‘‘మీరు చేసింది ఏమైనా గొప్ప పనా? జడ్జీలు, జర్నలిస్టులు, సినిమా తారలను వదలకపోతిరి..పెళ్లాం మొగుళ్ల  ఫోన్​ కాల్స్​ని చాటుగా వింటిరి. ఏం రోగం అది. ఇట్లాంటి పనులు చేస్తే చేతికి బేడీలు వేసుకొని ఈడ్చుకొని రావాలి. మన పోలీసోళ్లు చాలా మంచోళ్లు కాబట్టి ఆయన వయసుకు గౌరవం ఇచ్చి బంజారాహిల్స్​లోని వాళ్ల ఇంటిలో విచారణ జరుపుతామని రమ్మన్నరు. 

దీనిపై కూడా రాద్ధాంతం చేసిన్రు’’ అని సీఎం దుయ్యబట్టారు. తెలంగాణలో కేసీఆర్​ చరిత్రను రూపుమాపడానికి తాను ప్రయత్నిస్తున్నానని బీఆర్ఎస్​ నేతలు అంటున్నారని, తనకు ఆ అవసరం లేదన్నారు. ‘‘హరీశ్​రావు.. మీ మామ దొంగ నోట్ల చరిత్ర నేను తుడిపినా పోతదా.. చిక్కడ పల్లి పోలీస్​ స్టేషన్​లో కేసీఆర్​ పేరు ఉందని మీ పక్కన ఉండే ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​అన్నడు. ఆ కేసులో కేసీఆర్​ ముద్దాయి అని చెప్పిండు. 

ఇది నేను అన్నది కాదు. మీ చరిత్ర దొంగ పాస్​ పోర్టులు.. మీ చరిత్ర దొంగ నోట్లు.. మీ చరిత్ర దళితులను దగా చేసిన చరిత్ర.. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి చెయ్యని చరిత్ర.. తెలంగాణ ఉద్యమకారులను దోఖా చేసిన చరిత్ర.. దానిని ఎవ్వడు చెరపలేరు..  మీరు తెలంగాణకు చేసిన ద్రోహాలను ఊరూరా మా కార్యకర్తలకు చెప్పి గోడలమీద రాయిస్తా’ అని సీఎం అన్నారు. 

కేసీఆర్ నిర్లక్ష్యానికి బలైన రంగారెడ్డి జిల్లా

కేసీఆర్ పదేండ్ల నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైందని సీఎం రేవంత్​ ఆరోపించారు. ‘‘కేసీఆర్​ ఎప్పుడూ పక్క రాష్ట్రం కోసమే మాట్లాడుతరు.. రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తామని చెప్పిండు.. కానీ, హైదరాబాద్​పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లాకు నీళ్లిచ్చుడు మరిచిండు’’ అని ఎద్దేవా  చేశారు. మాజీ సీఎం వైఎస్సార్​ రంగారెడ్డి జిల్లాకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి తుమ్మిడిహెట్టి దగ్గర రూ.30 వేల కోట్లతో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్​ స్టార్ట్​ చేశారని గుర్తుచేశారు. 

రంగారెడ్డి, మహబూబ్​నగర్​ ఉమ్మడి జిల్లాల పరిధిలో 14 లక్షల ఎకరాలకు సాగునీరు, ప్రజలకు స్వచ్చమైన తాగునీరందించే ఈ పథకాన్ని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్​ పట్టించుకోలేదని విమర్శించారు. దీంతో వైఎస్సార్​ గవర్నమెంట్​ వందల కోట్లు ఖర్చు పెట్టి అప్పటికే తవ్విన అండర్​ గ్రౌండ్​ టన్నెల్​ పనులు ఎక్కిడికక్కడే అగిపోయాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ పేరుతో రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఉమ్మడి మెదక్​ జిల్లాలో మల్లన్నసాగర్​, కొండపోచమ్మ సాగర్​ రిజర్వాయర్లు నిర్మించి రంగారెడ్డి జిల్లాను పడావు పెట్టారని  విమర్శించారు. 

ప్రతి యేటా సముద్రంలో 3 వేల టీఎంసీలు వృథాగా కలుస్తున్నయ్​ అని అసెంబ్లీలో పవర్​పాయింట్​ ప్రజెంటేషన్​ ఇచ్చిన కేసీఆర్..​ఆ  తర్వాత చంద్రబాబు కోసం విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు వరకు గోదావరి జలాలు తీసుకుపోండి అని ఉచిత సలహాలు ఇచ్చిండని మండిపడ్డారు. 300 టీఎంసీల నీళ్లు రంగారెడ్డి జిల్లాకు తరలిస్తే తాగు, సాగునీరుకు తల్లాడుతున్న ప్రజలకు ఎంతో మేలు జరిగేదన్నారు. లక్ష కోట్లతో కేసీఆర్​ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్​ మూడేండ్లకే కూలేశ్వరం ప్రాజెక్ట్​గా మారిందన్నారు. ఈ ప్రాజెక్ట్​ వల్ల కేసీఆర్​కు ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల ఫాం.. కేటీఆర్​కు జన్వాడ, కవితకు శంకర్​పల్లి, హరీశ్​రావుకు మోయినాబాద్​లో ఫాం హౌజ్​లు వచ్చాయన్నారు. భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ దగ్గర లిప్ట్​లు, బ్యారేజీలు కట్టిన కేసీఆర్​ ఆ జిల్లాలో ఒక గుంట భూమికి నీళ్లవ్వలేదని విమర్శించారు. 

గల్లీవాళ్లు ఢిల్లీకి వెళ్లి అడగాలా? 

మోదీని చూసి ఓటేయాలని బీజేపీ వాళ్లు అంటున్నారని ‘మోదీని చూసి ఓటేస్తే గల్లీలో ఉండేవాళ్లు పనిచేయకపోతే ఢిల్లీకి వెళ్లి అడగాలా?’ అని సీఎం రేవంత్​ సెటైర్ ​వేశారు. ‘‘పెండ్లి పెద్దను చూసి పిల్లను ఇస్తే.. పిలగాడు సంసారానికి పనికిరాకపోతే ఎవర్ని అడగాలి. ఇయ్యాల మోదీని చూసి ఓటేస్తే.. గల్లీలో ఉండే బోడిగాడు పనిచేయకపోతే మోదీని అడగగలమా?’’ అని రేవంత్​ అన్నారు. బీజేపీ కార్యకర్తలు వాళ్ల బీ ఫాంలను  బీఆర్ఎస్ ఆఫీసులో తెచ్చుకుంటున్నారని ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారని తెలిపారు. 

బీఆర్​ఎస్, బీజేపీ చీకటి ఒప్పందాలు ఈ ఎన్నికల ద్వారా బయటపడుతున్నాయని చెప్పారు. ఎందుకింత భావదారిద్ర్యం అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ పార్టీని ఓడించడానికి బీజేపీ, బీఆర్​ఎస్​ పార్టీలు కలిసి కుట్రలు పన్నుతున్నాయని వివరించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను.. తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని కామెంట్ చేశారు. 

ఎనిమిదేండ్లు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యమే

కేసీఆర్, కల్వకుంట్ల కిషన్​రావు (కిషన్​ రెడ్డి) రాసిపెట్టుకోండి.. రాబోయే ఎనిమిదేండ్లు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యమే నడుస్తుందని సీఎం రేవంత్​ జోస్యం చెప్పారు. ప్రజా పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తున్నామన్నారు. దళిత బిడ్డను అసెంబ్లీలో సభాధ్యక్షున్ని చేస్తే మొఖం చెల్లక కేసీఆర్​ శాసనసభకు రావట్లేదు విమర్శించారు. 

పురాణాలలో ప్రజల క్షేమం కోసం యజ్ఞాలు, యాగాలు చేస్తుండగా వాటిని చెడగొట్టడానికి రాక్షసుల గురువు శుక్రాచార్యుడు   మారీచుడు, సుబాహులను పంపించి ఆ యాగాలు జగరకుండా అడ్డుకునే వాళ్లని.. ఇప్పుడు కేసీఆర్​ కూడా కేటీఆర్​, హరీశ్​​రావులను పంపి తమ కాళ్లల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్​ విమర్శించారు. 

ఇప్పటికే ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని.. నిరుద్యోగులకు 70 వేల ఉద్యోగాలు, గ్రూప్​–1 పోస్టులు, కొత్త రేషన్​ కార్డులు, సన్నబియ్యం సప్లయ్, రైతులకు రూ.20 వేల కోట్ల రుణమాఫీ, 9 వేల కోట్ల రైతు భరోసా డబ్బులు అందించామని, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సులు, వేల కోట్ల రుణాలు, ఇందిరమ్మ చీరెలు అందించామని సీఎం అన్నారు. రాబోయే రోజుల్లో ట్రిపుల్​ఆర్, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్​, మూసీ రివర్​ ఫ్రంట్​ ప్రాజెక్ట్​లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 

బీఆర్​ఎస్​, బీజేపీవి చీకటి ఒప్పందాలు: మంత్రి శ్రీధర్​బాబు

మున్సిపల్​ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ, బీఆర్ఎస్​ మధ్య చీకటి ఒప్పందాలు జరిగాయని మంత్రి శ్రీధర్​బాబు ఆరోపించారు. ఇటీవల తాండూర్​కు చెందిన బీజేపీ నాయకులు ఆ పార్టీ నుంచి బయటకి వచ్చి ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థులకు బీ ఫాంలను బీఆర్​ఎస్​ ఆఫీసులో ఇచ్చినట్టు వారు చెప్పారని వివరించారు. వారి కుట్రలను అడ్డుకుని కాంగ్రెస్​ పార్టీని గెలిపించేందుకు కార్యక ర్తలు కష్టపడి పనిచేయాలన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం గడిచిన రెం డేండ్లలో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పనులు చేసిందన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మధ్యలో ఉందని.. రాబోయే పదేండ్లలో చేపట్టబోయే పనులపై చాలా ముందుచూపుతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న దన్నారు. పరిగి నియోజకవర్గానికి రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్​ స్కూల్​ మంజూరు చేసి ఇటీవల పునాది వేసినట్టు తెలిపారు. రీజినల్​ రింగ్​ రోడ్డు నిర్మాణం కోసం లోకల్​ ఎమ్మెల్యే ఎంతగానో శ్రమిస్తున్నారని చెప్పారు. ట్రిపుల్ ఆర్​ రోడ్డు పూర్తయితే ఈ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతుందని మంత్రి పేర్కొన్నారు.

తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రాంతాలు సస్యశ్యామలం చేస్తం

రాబోయే మూడేండ్లలో గోదావరి జలాలు తెచ్చి తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని సీఎం రేవంత్​ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోనే చాలా ఎత్తయిన ప్రాంత మైన లక్ష్మీదేవిపల్లిలో రిజర్వాయర్​ నిర్మించి ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్​ నగర్​ జిల్లాలకు సాగు, తాగునీరు అందిస్తామని ఆ ప్రాజెక్ట్​ను కట్టడాననికి అవసరమైన ప్రణాళికలు పూర్తయ్యా యని సీఎం చెప్పారు. మక్తల్–నారాయణపేట ప్రాజెక్ట్​ నిర్మించి కృష్ణా నది జలాలతో 1.50 లక్షల ఎకరాలకు సాగునీళ్లిస్తామన్నారు. 2014, 2018లో కాంగ్రెస్​ బీ ఫాంపై ఎమ్మెల్యేగా గెలిచి రెండో సారి కేసీఆర్​ సీఎం అయ్యాక అభివృద్ధి కోసం పార్టీ మారిన అని చెప్పి బీఆర్​ఎస్​లో చేరిన సబితాఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లాకు చుక్కనీరు రాకపోవడంపై ఏమి  సమాధానం చెప్తారని నిలదీశారు. 

సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా ప్రజలకు చేసింది నమ్మకద్రోహం కాదా? అని సీఎం ప్రశ్నించారు. ‘‘అప్పా జంక్షన్​ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు ఎట్లా ఉందో మనం చూసినం. ఎన్ని ప్రాణాలు పోయినవో చూసినం. పర్యావరణం పేరుతో కేసులు పెడితే.. ఒక్క రోజు కూడా రాజీ కుదిర్చే ప్రయత్నం చేయలే. మేము అధికారంలోకి వచ్చాక సమస్య పరిష్కరించి రోడ్డు పనులు స్టార్ట్​ చేసినం. పదేండ్ల పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల బస్సు ప్రమాదంలో 40 మందికి పైగా చనిపోయారు. ఈ పాపం కేసీఆర్, సబితది కాదా? మీరు చేసిన పాపం కాదా? మీరు చేసిన హత్యలు కాదా?’’ అని రేవంత్​ ప్రశ్నించారు.

రాష్ట్రంలో పదేండ్లు కేసీఆర్​ సీఎం, కేటీఆర్​ మున్సిపల్​ శాఖ మినిస్టర్​గా ఉన్నరు. మోదీ మూడో సారి పీఎం అయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలే గత పదేండ్లలో మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా ఉన్నారు. ఒక్క రోజు కూడా మన మోరీలు ఎట్లుంటయో చూడలేదు. రూపాయి ఇయ్యలే.. చిల్లిగవ్వ రాలే. మన సమస్యలు పట్టించుకోలే. అలాంటి పార్టీల నేతలను దగ్గరికి రానివ్వొద్దు.  సీఎంగా, మున్సిపల్​ మంత్రిగా నేనే ఉన్నా.. అడిగేది మనమే.. ఇచ్చేది మనమే. మన వాళ్లను అన్ని మున్సిపాలిటీలలో గెలిపించండి. అభివృద్ధి నూటికి నూరు శాతం జరుగుతుంది.