బీజేపీలో ప్రాధాన్యం దక్కేది అవినీతిపరులకే : ప్రియాంక గాంధీ

బీజేపీలో ప్రాధాన్యం దక్కేది అవినీతిపరులకే : ప్రియాంక గాంధీ
  • ఆ పార్టీలో చేరితే అందరూ క్లీన్ అయిపోతరు: ప్రియాంక 

చిర్మిరి(చత్తీస్​గఢ్): అవినీతి లీడర్లకు బీజేపీ పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ విమర్శించారు. గురువారం చత్తీస్​గఢ్​లోని చిర్మిరిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. ‘‘బీజేపీ కేవలం రెండు రకాల లీడర్లనే ప్రోత్సహిస్తున్నది. అవినీతిపరులు, ప్రజల సంక్షేమం పట్టించుకోని వాళ్లకే ఆ పార్టీ ప్రాధాన్యం ఇస్తున్నది. బీజేపీలో అత్యంత అవినీతిపరులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే వాళ్లు ఇతర అవినీతి లీడర్లందరినీ ఒక్కటిచేసి, బీజేపీలోకి తీసుకొస్తారు. వాళ్లు మొదట ఇతర పార్టీల్లోని అవినీతి లీడర్లపై ఆరోపణలు చేస్తారు. ఆ తర్వాత ఆ లీడర్లపై ఒత్తిడి పెంచి బీజేపీలోకి వచ్చేలా చేస్తారు. బీజేపీలో చేరంగనే ఆ లీడర్లు క్లీన్ అయిపోతారు. వాళ్లపై కేసులు ఉండవ్. ఇక రెండో రకం లీడర్లు ప్రజా సమస్యలను, ప్రజా సంక్షేమాన్ని అస్సలు పట్టించుకోరు. ధరలు పెరిగినా, ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నా కనీసం మాట్లాడరు. అలాంటి వాళ్లకు కూడా బీజేపీలో ప్రాధాన్యం ఉంటుంది” అని ప్రియాంక విమర్శించారు. కానీ కాంగ్రెస్​లో అలా ఉండదని, ప్రజల కోసం పనిచేసే లీడర్లకే తమ పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.

దేశంలో 70 కోట్ల మంది నిరుద్యోగులు.. 

ప్రజలు ఎప్పుడూ తమ బానిసలుగా బతకాలని బీజేపీ చూస్తోందని ప్రియాంక అన్నారు. ‘‘ప్రజలెప్పుడూ తమ మీదే ఆధారపడి బతకాలని బీజేపీ ప్లాన్ వేస్తున్నది. అందుకే 5 కిలోల రేషన్ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నది. కానీ యువతకు జాబ్స్ మాత్రం ఇవ్వట్లేదు” అని మండిపడ్డారు. ‘‘తాను నిజాయితీపరుడినని, అవినీతిపై పోరాడుతున్నానని మోదీజీ చెబుతున్నారు. ఆయన మాటల్లో నిజాయితీ ఉండదు. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం? ఎన్ని వర్సిటీలు ఏర్పాటు చేశాం? ఎన్ని ఆస్పత్రులు నిర్మించాం? అనేవి ఏవీ కూడా మోదీ నిజాయితీగా చెప్పరు” అని విమర్శించారు. ‘‘దేశంలో గత 35 ఏండ్లలో లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయింది. 70 కోట్ల మందికి ఉపాధి లేదు. మరోవైపు 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న వాటిని బీజేపీ ప్రభుత్వం భర్తీ చేయడం లేదు” అని ప్రియాంక ఫైర్ అయ్యారు.