గవర్నర్ వస్తరని..బాత్రూమ్లు కట్టి.. బడికి రంగులేసి..
తమిళిసై పర్యటన నేపథ్యంలో భూపాలపల్లిలో బోడగూడెం ముస్తాబు
వాటర్ ట్యాంక్ కట్టి.. కరెంట్ కనెక్షన్లు ఇచ్చిన అధికారులు
మొక్కలు నాటిన్రు.. రోడ్డు సక్కగ చేసిన్రు
సిమెంట్ రింగులు మోసిన ఆఫీసర్లు
అది ఒక గిరిజన గ్రామం.. కేవలం30 కుటుంబాలు ఉంటాయి. అంతా కలిపి ఓ 110 మంది అక్కడ ఉంటున్నారు. ఆ ఊరికి ఇప్పటి దాకా ప్రభుత్వ పెద్దలెవ్వరూ వెళ్లలేదు. అయితే ఒక్కసారిగా ప్రభుత్వ పెద్దలు, ఆఫీసర్లు ఉరుకుల పరుగుల మీద వచ్చారు. బాత్రూమ్లు కట్టారు. బడికి రంగులేశారు. ఊళ్లో మొక్కలు నాటారు. కరెంట్ కనెక్షన్లు ఇచ్చారు. తాగునీరు అందించారు. కేవలం ఒకే ఒక్క రోజులో గ్రామం రూపురేఖలే మారిపోయాయి. మంగళవారం రాష్ట్ర గవర్నర్తమిళిసై పర్యటన సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్‌పల్లి హామ్లెట్ విలేజ్ బోడగూడెం ముస్తాబైంది.
ఉన్నది 110 మందే
కాటారం మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిజన గ్రామం బోడగూడెం. నాయక్ పోడ్, కోయ జాతికి చెందిన వారు 110 మంది అక్కడ బతుకుతున్నారు. 22 ఇండ్లలో 30 కుటుంబాల వాళ్లు నివసిస్తున్నారు. 14 పెంకుటిళ్లు కాగా, 8 గుడిసెలు ఉన్నాయి. అవి కూడా గత ప్రభుత్వాల హయాంలో కట్టించిన ఇళ్లని గ్రామస్తులు చెప్పారు. అందరికి కలిపి 23.4 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. ఈ గ్రామంలో డిగ్రీ వరకు చదివింది ఇద్దరే.
ఊరు మారింది..
అసలు అక్కడ ఒక ఊరు ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. కానీ ఎన్నడూ లేనిది ఆఫీసర్లు వచ్చారు. రోడ్డు పక్కల మొక్కలు నాటారు. ఊర్లోని బడికి, అంగన్ వాడీ కేంద్రానికి రంగులేశారు. ఇంటింటికి బాత్రూంలు.. లెట్రిన్లు కట్టారు. అన్నీ ఇళ్లకు కరెంట్ కనెక్షన్లు ఇచ్చారు. ఇన్ని రోజులు పట్టించుకోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను పూర్తి చేసి నల్లా నీళ్లు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. దశాబ్దాల నుంచి లేని కళ ఆ ఊరికి ఒక్క రోజులోనే వచ్చింది. గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయించడం కోసం సోమవారం ఆఫీసర్లు సిమెంట్ రింగులు మోసి మరీ పనిచేయించారు. గవర్నర్ రాక పుణ్యమా అని గ్రామంలో ఆఫీసర్లు పనులు చేస్తున్నారని బోడగూడెం ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పెద్ద మేడమ్ వస్తున్నదట
తమ గ్రామానికి గవర్నర్ తమిళిసై వస్తున్న విషయం తెలిసి గ్రామస్తులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘ఊరికి పెద్ద మేడమ్వస్తున్నదట. మాతో మాట్లాడుతుందట’ అంటూ బోడగూడెం ప్రజలు తెగ సంతోషపడుతున్నారు. సంబరపడుతున్నారు. తమ బాధలు చెప్పుకుంటే ఏమన్న సాయం చేస్తరేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఒక్క ఇల్లు కూడ సక్కగా లేదు
ఊర్ల ఒక్క ఇల్లు కూడ సక్కగా లేదు. ఇగనో అగనో కూలి పోతాయన్నట్టు ఉన్నయి. డబుల్ బెడ్రూమ్ఇండ్లు ఇప్పియండి సార్లు. గవర్నర్ మేడంతో మాట్లాడనీకి వీలైతదో లేదో. ఊర్ల కరెంట్ లేని ఇళ్లు ఉన్నయి. అసలు ఇండ్లు లేనోళ్లు ఉన్నరు.
‑ కాల్నేని వనిత, బోడగూడెం
గవర్నర్ అంటే ఎవరు?
గవర్నర్ మేడం వస్తదని తెలిసిన కాన్నుండి మా ఊరోళ్లు గవర్నర్ అంటే ఎవలు అని అడుగుతున్నరు. సీఎం సారు కంటే పెద్ద అని చెబితే.. ‘అవునా. మరి ఊరు బాగైతదా’ అంటున్రు. ‘నాయకుల లెక్క వచ్చి పోవుడేనా లేక ఎమన్నా జేస్తదా’ అని అడుగుతున్నరు.
‑ ముళ్లు నరీన్, బోడగూడెం
