సాకారం దిశగా సూర్యాపేట రైలు! రూ. 5,330 కోట్లతో డోర్నకల్ టు గద్వాల కొత్త లైన్!

సాకారం దిశగా సూర్యాపేట రైలు!  రూ. 5,330 కోట్లతో డోర్నకల్ టు గద్వాల కొత్త లైన్!
  •     రెండు ప్రధాన రైల్వే మార్గాలను అనుసంధానిస్తూ కేంద్రం గ్రీన్ సిగ్నల్
  •     296 కిలోమీటర్ల మేర ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి.. 
  •     నేరుగా రైల్వే మ్యాప్‌‌‌‌‌‌‌‌లోకి సూర్యాపేట

సూర్యాపేట, వెలుగు:  రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రానికి దశాబ్దాల కాలంగా ఉన్న రైల్వే లైన్ కల త్వరలోనే సాకారం కానుంది. డోర్నకల్ నుంచి గద్వాల వరకు 296 కిలోమీటర్ల మేర నిర్మించనున్న కొత్త రైల్వే లైన్‌‌‌‌‌‌‌‌కు కేంద్ర రైల్వే శాఖ ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 5,330 కోట్ల భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను కేటాయించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి కావడంతో పాటు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పనులు కూడా ప్రస్తుతం వేగంగా పురోగతిలో ఉన్నాయి.

కొత్త రైల్వే లైన్ ఇలా..

ఈ కొత్త రైల్వే లైన్ మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ మీదుగా సాగే హైదరాబాద్–-బెంగళూరు మార్గాన్ని, వరంగల్ మీదుగా సాగే హైదరాబాద్-–విజయవాడ మార్గాన్ని అనుసంధానిస్తుంది. డోర్నకల్ వద్ద ప్రారంభమయ్యే ఈ లైన్ ఖమ్మం రూరల్, కుసుమంచి, పాలేరు, మోతె మీదుగా సూర్యాపేట చేరుకుంటుంది. అక్కడి నుంచి నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్, వనపర్తి, భూత్పూర్ మీదుగా గద్వాల వద్ద ముగుస్తుంది. ఈ మార్గం నల్గొండ వద్ద నడికుడి-గుంటూరు లైన్‌‌‌‌‌‌‌‌ను కూడా కలుపుతుండటం విశేషం.

కొన్ని ప్రాంతాల్లో మార్కింగ్ ప్రక్రియ పూర్తి !

ప్రస్తుతం సూర్యాపేట జిల్లా పరిధిలో మేళ్లచెర్వు, మఠంపల్లి లాంటి స్టేషన్లు ఉన్నప్పటికీ, అవి కేవలం సిమెంట్ పరిశ్రమల సరుకు రవాణాకే పరిమితమయ్యాయి. ఈ కొత్త లైన్ పూర్తయితే సూర్యాపేట పట్టణం నేరుగా రైల్వే మ్యాప్‌‌‌‌‌‌‌‌లోకి రావడమే కాకుండా, ప్రయాణికులకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. సర్వే బృందం ఇప్పటికే నాయకనగూడెం, కొత్తగూడెం, తుమ్మలపల్లి లాంటి ప్రాంతాల్లో రహదారి పాసింగ్‌‌‌‌‌‌‌‌లను గుర్తించి మార్కింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. కాగా, ఈ రైల్వే మార్గంతో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లాల్లో పారిశ్రామిక, పర్యాటక రంగాలు భారీగా వృద్ధి చెందనున్నాయి. ఈ ప్రాంతాల్లో ఉన్న బొగ్గు గనులు, సిమెంటు ఫ్యాక్టరీలు, విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి సరుకు రవాణా సులభతరం అవుతుంది. వ్యవసాయ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు రైతులకు తక్కువ ఖర్చుతో కూడిన రవాణా మార్గం అందుబాటులోకి వచ్చి, ఈ ప్రాంత ఆర్థిక ముఖచిత్రం మారనుంది.