లోన్స్ నుండి సిబిల్ వరకు ఏప్రిల్ 1 నుండి కొత్త బ్యాంకింగ్ రూల్స్.. వీరికి పండగే..

 లోన్స్ నుండి సిబిల్ వరకు ఏప్రిల్ 1 నుండి కొత్త బ్యాంకింగ్ రూల్స్.. వీరికి పండగే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త బ్యాంకింగ్ నిబంధనలను అమలు చేయబోతుంది. బ్యాంకు కస్టమర్లకు మేలు చేసేలా, పారదర్శకతను పెంచేలా ఆర్‌బీఐ ఈ కీలక మార్పులు చేసింది. అవేంటంటే...

1. నలుగురు నామినీలు 
ఇప్పటివరకు మీ బ్యాంకు అకౌంట్ లేదా లాకర్‌కు ఒకరిద్దరిని మాత్రమే నామినీలుగా పెట్టే వీలుండేది. కానీ ఇప్పుడు మీ బ్యాంకు అకౌంట్లు, లాకర్లకు గరిష్టంగా నలుగురిని నామినీలుగా చేర్చుకోవచ్చు. దీనివల్ల కుటుంబికులకు భవిష్యత్తులో ఆస్తుల నిర్వహణ సులభం అవుతుంది.

2. వారానికి ఒకసారి
సాధారణంగా మీ సిబిల్ స్కోర్ ప్రతి నెలకి ఒకసారి మాత్రమే అప్‌డేట్ అయ్యేది. కానీ కొత్త రూల్ ప్రకారం ప్రతి 7 రోజులకు ఒకసారి మీ సిబిల్ స్కోర్ అప్‌డేట్ అవుతుంది.. అంటే ప్రతి నెల 7, 14, 21, 28  తేదీల్లో.  దీని వల్ల లాభం ఏంటంటే  మీరు అప్పు కట్టగానే ఆ వివరాలు వెంటనే స్కోర్‌లో కనిపిస్తాయి. దీనివల్ల లోన్ కోసం ప్రయత్నించే వారు సిబిల్ స్కోరును త్వరగా పెంచుకోవచ్చు. 

3.  ఛార్జీలు సున్నా!
చాలామంది దగ్గర డబ్బు ఉన్నప్పుడు లోన్‌ను ముందే క్లోజ్ చేయాలనుకుంటారు. కానీ బ్యాంకులు 'ఫోర్‌క్లోజర్' లేదా 'ప్రీ-పేమెంట్' పేరుతో జరిమానా వసూలు చేసేవి. ఇకపై ఫ్లోటింగ్ వడ్డీ రేటు ఉన్న హోమ్ లోన్, కార్ లోన్, ఎడ్యుకేషన్ లేదా  పర్సనల్ లోన్లపై ముందస్తు చెల్లింపు లకు  ఛార్జీలు ఉండవు. అంటే ఎక్స్‌ట్రా ఖర్చు లేకుండా మీ అప్పును ఎప్పుడైనా తీర్చేయవచ్చు.

4. వ్యాపారులకు ఊరట
బంగారు ఆభరణాల వ్యాపారులు తీసుకునే 'గోల్డ్ మెటల్ లోన్' (GML) తిరిగి చెల్లించే గడువును పెంచారు. ఇంతకు ముందు పాత గడువు 180 రోజులు ఉండేవి. కానీ కొత్త గడువు 270 రోజులు చేసారు. దీనివల్ల నగల వ్యాపారులకు నగదు నిర్వహణ ఈజీ ఆవుతుంది.

5. తక్కువ వడ్డీకే లోన్లు 
మీ క్రెడిట్ స్కోర్ ప్రతి వారం అప్‌డేట్ అవుతుంది కాబట్టి, మంచి స్కోర్ ఉన్నవారు బ్యాంకులతో మాట్లాడి తక్కువ వడ్డీ రేట్లు పొందవచ్చు. మంచి క్రెడిట్ ప్రొఫైల్ ఉంటే.. బ్యాంకులు ఇచ్చే ఆఫర్ల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. వెంటనే తక్కువ వడ్డీకి లోన్ పొందే ఛాన్స్ ఉంటుంది.