- హాజరైన మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నూతన చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తన తండ్రి, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఆశీర్వాదం తీసుకున్న విజయలక్ష్మి.. చైర్ పర్సన్ హోదాలో తొలి ఫైల్‌పై సంతకం చేశారు. ఆమెతో పాటు కమిషన్ సభ్యులుగా నియమితులైన కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళ యాదవ్ రెడ్డి, సదా లక్ష్మి, రాధా భాయ్, ఉజ్మా ఆషయ్ షాకీర్ కూడా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, పలువురు అధికారులు హాజరయ్యారు.
మహిళలకు రక్షణ కవచంలా నిలవాలి: పొన్నం
తెలంగాణ మహిళల రక్షణ కోసం మహిళా కమిషన్ పటిష్టంగా పని చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గద్వాల విజయలక్ష్మి నాయకత్వంలోని ఈ కమిషన్ మహిళా హక్కులకు రక్షణ కవచంలా నిలవాలని, ఆపదలో ఉన్న ప్రతి మహిళకు అండగా ఉండాలన్నారు. గతంలో మేయర్‌గా పనిచేసిన అనుభవం విజయలక్ష్మికి ఉందని, కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా పని చేయాలని సూచించారు. చైర్ పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మహిళల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. మాజీ మంత్రి గీతారెడ్డి, ఉన్నతాధికారులు అనితా రామచంద్రన్, శ్రుతి ఓజా, ఆర్వీ కర్ణన్ పాల్గొని నూతన కమిషన్‌కు అభినందనలు తెలిపారు.
