గ్రానైట్ అక్రమంగా రవాణా చేస్తూ కోట్లు సంపాదించాడు ఓ వ్యక్తి. భార్య మొబైల్ నెంబర్ తో ఫేక్ ఇన్వాయిస్ లు తయారు చేసి.. ఈవే బిల్లులు సృష్టించి.. నకిలీ సంస్థను క్రియేట్ చేసి కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించకుండా వెనకేసున్నాడు. ఈ కేసులో 2026 మే 21వ తేదీన కరీంనగర్‌కు చెందిన దాసరి శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు DGGI హైదరాబాద్ అధికారులు.
CGST చట్టంలోని సెక్షన్ 69 కింద అరెస్ట్ శ్రీకాంత్ను అరెస్టు చేసిన అధికారులు.. సెక్షన్ 132(1)(a) కింద కేసు నమోదు చేశారు. నకిలీ GST సంస్థ మనోజ్ ఎంటర్‌ప్రైజెస్ పేరిట భారీ గ్రానైట్ అక్రమ రవాణాకు పాల్పడినట్లు గుర్తించారు. ఇన్వాయిసులు, ఈ-వే బిల్లులు లేకుండా గ్రానైట్ స్లాబ్‌ల రవాణా చేసినట్లు గుర్తించారు.
రూ.80–100 కోట్ల విలువైన ఈ-వే బిల్లులు జనరేట్ చేసి GST రిటర్నుల్లో నిల్ ఫైలింగ్ చేశాడు. ప్రభుత్వానికి సుమారు రూ.16.96 కోట్ల GST ఎగవేత జరిగినట్లు DGGI అంచనా వేసింది. భార్య మొబైల్ నంబర్‌తో ఫేక్ ఇన్వాయిసులు, ఈ-వే బిల్లులు సృష్టించిన శ్రీకాంత్.. స్నేహితుడి బ్యాంక్ ఖాతాను GST రిజిస్ట్రేషన్‌కు లింక్ చేసినట్లు విచారణలో వెల్లడైంది.
మనోజ్ తారా పేరిట నకిలీ సంస్థ నమోదు చేశారు. అసలు వ్యక్తికి సంస్థపై అవగాహనలేదని సమాచారం. ఆధార్, PAN వివరాలను దుర్వినియోగం చేసి ఫేక్ GST సంస్థ సృష్టించిన గ్రానైట్ సిండికేట్ ను పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న ముఠా గుట్టు బట్టబయలుచేశారు. దీని వెనుక రాజస్థాన్‌కు చెందిన పలువురు వ్యక్తుల ప్రమేయంపై DGGI దర్యాప్తు చేస్తోంది.
శేర్లింగంపల్లి, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో అక్రమ గ్రానైట్ నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. ప్రగ్నాపూర్ వద్ద గ్రానైట్ స్లాబ్‌లతో వెళ్తున్న ట్రక్కులు సీజ్ చేశారు. నగదు లావాదేవీలు ట్రక్ డ్రైవర్ల ద్వారా నిర్వహించినట్లు అనుమానిస్తున్నారు. బ్రోకర్లు, గ్రానైట్ మార్కర్లు, ఫ్యాక్టరీలతో కూడిన భారీ ఫేక్ ఈ-వే బిల్ రాకెట్ వెలుగులోకి వచ్చాయి.
