విద్యార్థినుల ప్రైవేటు వీడియోలు లీక్

 విద్యార్థినుల ప్రైవేటు వీడియోలు లీక్

పంజాబ్ లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ క్యాంపస్ లో ఉండే ఓ యువతి తన హాస్టల్ మేట్స్ ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడం వివాదానికి దారితీసింది. ఈనేపథ్యంలో హాస్టల్ విద్యార్థులు నిరసనకు దిగారు. తనతో పాటు రూంలో ఉంటున్న మిగతా అమ్మాయిల ప్రైవేటు వీడియోలు సీక్రెట్ గా తీసిన నిందితురాలు.. వాటిని సోషల్ మీడియాలో  పోస్ట్ చేసింది. ఈ విషయం బాధితురాలికి తెలియడంతో.. నిందితురాలిని నిలదీసింది. తర్వాత  హాస్టల్లోని విద్యార్థులంతా నిరసనకు దిగారు. 

విద్యార్థులకు ఆప్ అండగా ఉంటుంది

స్టూడెంట్ల నిరసనలతో యూనివర్సిటీ దగ్గర టెన్షన్  వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరి స్టూడెంట్ల వీడియోలు కూడా లీక్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిరసన తెలుపుతుండగా.. ఒక స్టూడెంట్ స్పృహతప్పి పడిపోవడంతో ఆమెను హాస్పిటల్ కు తరలించారు.

ఈ ఘటనపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడాన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు. బాధ్యులను ఎవరినీ వదిలిపెట్టబోమని..వారందరికీ కఠిన శిక్ష పడుతుందని హెచ్చరించారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని..అందరికీ అండగా ఉంటామని చెప్పారు. స్టూడెంట్స్ ఆందోళన విరమించి ప్రశాంతంగా ఉండాలని సూచించారు. 

ప్రైవేటు వీడియో కలకలంతో హాస్టల్ లోని పలువురు స్టూడెంట్లు ఆత్మహత్యకు యత్నించినట్లు వార్తలు బయటకొచ్చాయి. వీటిని పోలీసులు, యూనివర్సిటీ పరిపాలనా విభాగం కొట్టిపారేసింది. పుకార్లు నమ్మొద్దని మొహాలీ ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ స్పందించారు. నిందితులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. విద్యార్థులందరూ ప్రశాంతంగా ఉండాలని కోరారు.