కూతురి నిశ్చితార్థం జరిగాక ఇలా కావడంతో.. అవమాన భారంతో కుటుంబం ఆత్మహత్య

కూతురి నిశ్చితార్థం జరిగాక ఇలా కావడంతో.. అవమాన భారంతో కుటుంబం ఆత్మహత్య

బెంగళూరు: కర్ణాటకలోని మైసూరు జిల్లాలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లికి ఒక్క రోజు ముందు.. 21 ఏళ్ల యువతితో పాటు ఆమె తల్లి, తండ్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన కలకలం రేపింది. చనిపోయిన ముగ్గురిని శివన్న (50), అతని భార్య నాగరాత్న (45), వారి కూతురు రక్షిత (21)గా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టి. నరసిపుర తాలూకాలోని హలేకంపయ్యనహుండి గ్రామంలోని ఇంట్లో ఈ కుటుంబం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. రక్షిత పెళ్లికి 24 గంటల ముందే ఈ ఘోరం జరిగింది. ఒక యువకుడి వేధింపులే ఈ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు కారణం అని తెలిసింది.

రక్షిత గ్రామానికే చెందిన ఉల్లాస్ గౌడ అనే యువకుడు రక్షితను పెళ్లి చేసుకోవాలనున్నాడు. రక్షితతో స్నేహంగా మెలిగేవాడు. మనసులో ఆమెపై మితిమీరిన ఇష్టం పెంచుకుని స్నేహం నటించేవాడు. ఆమెకు చెప్తే ఒప్పుకోదనే భయంతో చాన్నాళ్లు అలానే ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. ఈ క్రమంలోనే.. రక్షితకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూశారు. ఆమెకు నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ క్రమంలో.. ద్వేషంతో రగిలిపోయిన ఉల్లాస్ గౌడ ఆమె పెళ్లిని ఎలాగైనా చెడగొట్టాలనుకున్నాడు.

సంబంధాన్ని చెడగొట్టే ప్రయత్నంలో భాగంగా.. రక్షిత తనతో గడిపిందని ఊరంతా ప్రచారం చేశాడు. ఆమె కాబోయే భర్తకు మెసేజ్లు, స్నేహం అడ్డం పెట్టుకుని ఆమెతో దిగిన ఫొటోలను పంపాడు. దీంతో.. పెళ్లి కూతురి క్యారెక్టర్పై మచ్చ పడింది. పెళ్లి కొడుకు, అతని కుటుంబం ఈ పెళ్లికి వెనుకంజ వేశారు. ఈ పరిణామం.. రక్షితను, ఆమె కుటుంబాన్ని తీవ్రంగా కుంగదీసింది. తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. 

కూతురిపై జరిగిన దుష్ప్రచారంతో కుటుంబం పరువు పోయిందని, పెళ్లి చెడిపోయిందని రక్షిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ముగ్గురూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. విషం తాగే ముందు ఈ మరణాలకు ఉల్లాస్ గౌడనే బాధ్యుడిగా పేర్కొంటూ లెటర్ రాసి పెట్టినట్లు సమాచారం. ఆ లేఖలోని పూర్తి విషయాలను పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.