- వేరే బ్యాంకుకు మార్చాలని సర్కారు సూత్రప్రాయ నిర్ణయం
- రూ.5వేల కోట్లకు పైగా ప్రభుత్వ డిపాజిట్ల ఉపసంహరణ!
- ఎస్‌బీఐ అధికారులతో భేటీలో సీఎస్ రామకృష్ణారావు స్పష్టత
- ప్రత్యామ్నాయ భూమిని కూడా ఇవ్వబోమని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఖజానా (ట్రెజరరీ) నిర్వహణ బాధ్యతల నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)ను పూర్తిగా తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఐటీ కారిడార్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని విలువైన ప్రభుత్వ భూముల వేలాన్ని అడ్డుకుంటూ ఎస్‌బీఐ కోర్టుకు వెళ్లడంపై సర్కార్ తీవ్ర ఆగ్రహంతో ఉంది.
ఈ నేపథ్యంలోనే సీఎస్ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సెక్రటేరియెట్‌లో ఎస్‌బీఐ ఉన్నతాధికారుల బృందంతో సోమవారం సమావేశమయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించిన ‘ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ (ఐఎఫ్‌ఐఎంఎస్) పోర్టల్ నేరుగా ఎస్‌బీఐ సర్వర్లతోనే అనుసంధానమై ఉంది.
రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, చేసే ఖర్చులు అన్నీ ఒక నిర్దిష్ట బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారానే జరగాలి. దీనినే ట్రెజరరీ బ్యాంకు అంటారు. దీంతో ప్రజలు చెల్లించే స్టాంపు డ్యూటీ, మైనింగ్ ఫీజులు, కమర్షియల్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల వంటి ఆదాయాలన్నీ ఎస్‌బీఐ చలాన్ల ద్వారానే ప్రభుత్వ ఖాతాకు జమ అవుతున్నాయి.
అలాగే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, కాంట్రాక్టర్ల బిల్లులు, రైతు భరోసా, ఆసరా పెన్షన్ల వంటి సంక్షేమ పథకాల (డీబీటీ) నిధుల పంపిణీ కూడా ఈ బ్యాంకు ద్వారానే సాగుతోంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రాష్ట్ర బ్యాంకింగ్ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ)కి కూడా ఎస్‌బీఐ ‘లీడ్ బ్యాంక్’గా వ్యవహరిస్తోంది.
కాగా ప్రభుత్వ ఆస్తుల విషయంలో బ్యాంకు న్యాయపరమైన చిక్కులు సృష్టించడంతో.. ‘‘ట్రెజరర్ తీసేస్తాం’’ అంటూ ఈ సేవలన్నింటినీ ఎస్‌బీఐ నుండి రద్దు చేసి, కెనరా బ్యాంక్ లేదా యూనియన్ బ్యాంక్ వంటి ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులకు అప్పగించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు ఎస్‌బీఐ అధికారులకు సీఎస్ వివరించారు. ఇందులో భాగంగానే ఎస్‌బీఐలో ఉన్న సుమారు రూ.5,000 నుంచి రూ.6,000 కోట్ల మేర ప్రభుత్వ డిపాజిట్లను పూర్తిగా ఉపసంహరించుకోనున్నట్లు కూడా స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది.
ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే ఎస్‌బీఐతో ఉన్న ఆర్థిక బంధాలన్నింటినీ తెంచుకోవడానికి కూడా వెనుకాడబోమని సీఎస్ స్పష్టం చేశారు. లీడ్ బ్యాంక్ హోదా మార్పుపై ఆర్‌బీఐకి ఫిర్యాదు చేసేందుకు అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. భూమిపై న్యాయపరంగా ముందుకు వెళ్తున్నామని, తమపై ఆంక్షలు పెట్టవద్దని బ్యాంక్ అధికారులు కోరినట్లు సమాచారం.
ఆర్థిక సంబంధాలను వెంటనే తొలగించుకోవడంతో పాటు డిపాజిట్లను కూడా వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎస్‌ను కోరినట్లు వివరించారు. ఈ సందర్భంగా బ్యాంక్ తీరుపై సీఎస్ మండిపడినట్లు తెలుస్తోంది. భూమి విషయంలో ముందస్తుగా ఉన్న అవగాహన అంశాలను వారి ముందు పెట్టి ప్రశ్నించినట్లు సమాచారం. ఇలాగే వ్యవహరిస్తే ప్రత్యామ్నాయ భూమిని కూడా ఇవ్వబోమని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
