AIలో భారత్ వెనుకబాటు! గ్లోబల్ ఏఐ మార్కెట్లకు తరలుతున్న పెట్టుబడులు.. 14 రోజుల్లో రూ.14 వేల కోట్లు వెనక్కి..

AIలో భారత్ వెనుకబాటు! గ్లోబల్ ఏఐ మార్కెట్లకు తరలుతున్న పెట్టుబడులు.. 14 రోజుల్లో రూ.14 వేల కోట్లు వెనక్కి..
  • మార్చి నుంచి రూ.1.5 లక్షల కోట్ల విదేశీ నిధులు వెనక్కి..
  • ఈ ఏడాది మార్చి నుంచి రూ.1.5 లక్షల కోట్ల విదేశీ నిధులు వెనక్కి..
  •  ఎక్కువగా అమెరికా, తైవాన్, దక్షిణ కొరియాకు

న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గ్లోబల్ మార్కెట్లలో తెచ్చిన అవకాశాలు వల్ల విదేశీ పెట్టుబడిదారులు భారత్ నుంచి భారీగా నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. శామ్​సంగ్​, టీఎస్​ఎంసీ వంటి ఏఐ చిప్​ కంపెనీల స్టాక్స్​ వేగంగా పెరుగుతుండటమే ఇందుకు కారణం. 2023 మార్చి నుంచి 2024 అక్టోబర్ వరకు ఇండియా -ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్లలోకి వచ్చిన పెట్టుబడులలో 55 శాతానికిపైగా మొత్తం వెనక్కి వెళ్లిందని ఎలారా సెక్యూరిటీస్ గ్లోబల్ లిక్విడిటీ ట్రాకర్ (జీఎల్టీ)  రిపోర్ట్​ వెల్లడించింది.

దీని ప్రకారం..గత రెండు వారాల్లోనే రూ.14 వేల కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేయడం గమనార్హం. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) తమ నిధులను ఏఐ అవకాశాలు ఎక్కువగా ఉన్న అమెరికా, తైవాన్, దక్షిణ కొరియా మార్కెట్లకు తరలిస్తున్నారు. అమెరికా ఈక్విటీ మార్కెట్లలోకి గత వారంలోనే 120 బిలియన్ డాలర్లు (సుమారు రూ.10 లక్షల కోట్లు) పెట్టుబడులు వచ్చాయి. ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది.

 ఏడాది గరిష్టానికి డాలర్ ఇండెక్స్ 

అమెరికా టెక్నాలజీ కంపెనీలు ఏఐ విప్లవం వల్ల నేరుగా లబ్ధి పొందుతాయని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు ఎక్కువ కాలం పాటు కొనసాగుతాయనే అంచనాల మధ్య డాలర్ ఇండెక్స్ ఒక ఏడాది గరిష్ట స్థాయికి చేరింది. ఈ ఏడాది దక్షిణ కొరియా, తైవాన్, జపాన్, అమెరికా మార్కెట్లలోకి భారీగా నిధులు వచ్చాయి.

ఏఐ రంగంలో కీలకమైన శామ్​సంగ్, ఎస్​కే హైనిక్స్ కంపెనీల షేర్ల మద్దతుతో దక్షిణ కొరియా బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ సూచీ కోస్పి ఈ ఏడాది 204 శాతం కంటే ఎక్కువ పెరిగి రికార్డు సృష్టించింది. తైవాన్ సూచీ తైరెక్స్ 62 శాతం, జపాన్ సూచీ నిక్కీ 40 శాతం మేర లాభపడ్డాయి. అమెరికాకు చెందిన టెక్ ఆధారిత నాస్​డాక్​ సూచీ కూడా ఇప్పటి వరకు 14 శాతం ర్యాలీ చేసింది.

భారత్, చైనా మార్కెట్లపై ఒత్తిడి

గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్ ఫండ్లలో దక్షిణ కొరియా, తైవాన్ దేశాల వాటా ఇప్పుడు 52 శాతానికి చేరింది. తగినన్ని ఏఐ స్టాక్స్ లేకపోవడం వల్ల చైనా, భారత మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గత రెండు వారాల్లో చైనా నుంచి 440 మిలియన్ డాలర్లు  (రూ.3,600 కోట్లు ), భారత్ నుంచి 1.7 బిలియన్ డాలర్ల (రూ.14వేల కోట్లు ) విదేశీ నిధులు బయటకు వెళ్ళిపోయాయి.

బంగారం వంటి విలువైన లోహాల ఫండ్ల నుంచి పెట్టుబడిదారులు నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ విభాగం నుంచి ఉపసంహరణలు 12 వారాల గరిష్ట స్థాయి అయిన 3 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.25వేల కోట్లకు) చేరాయి. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు జరిగిన మొత్తం ఉపసంహరణల విలువ 18 బిలియన్ డాలర్లకు (రూ.1.5 లక్షల కోట్లు) చేరినట్లు ఎలారా సెక్యూరిటీస్​ తెలిపింది.