'రాజీవ్ స్వగృహ కార్పొరేషన్' త్వరలో కనుమరుగు.. తెలంగాణ హౌసింగ్ బోర్డులో విలీనం

'రాజీవ్ స్వగృహ కార్పొరేషన్' త్వరలో కనుమరుగు.. తెలంగాణ హౌసింగ్ బోర్డులో విలీనం
  • 330 పోస్టులకు 9 మంది ఉద్యోగులు మాత్రమే వర్కింగ్ 
  • కార్పొరేషన్‌ పరిధిలో రాష్ర్ట వ్యాప్తంగా 3500 కోట్ల ఆస్తులు
  • ఇందిరమ్మ ఇండ్లు, టవర్ల నిర్మాణానికి రాజీవ్ స్వగృహ స్థలాలు !

హైదరాబాద్, వెలుగు: సొంతిల్లు, ప్లాటు కొనుగోలు చేయాలనుకునే పేద, మధ్యతరగతి ప్రజల కోసం ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 'రాజీవ్ స్వగృహ కార్పొరేషన్' త్వరలో కనుమరుగు కానుంది. ఈ సంస్థను హౌసింగ్ శాఖ అనుబంధ సంస్థ అయిన తెలంగాణ హౌసింగ్ బోర్డులో విలీనం చేయనున్నారు. ఈ మేరకు హౌసింగ్ శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాసింది. 

త్వరలో జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించనుంది. గత కొన్నేళ్లుగా కార్పొరేషన్‌లో ఎలాంటి కార్యకలాపాలు లేకపోవడం, ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉండటంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

వేల కోట్ల విలువైన ఆస్తులు
పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజీవ్ స్వగృహ  కార్పొరేషన్ ఏర్పాటయింది.ఈ కార్పొరేషన్‌కు  అప్పటి 23 జిల్లాల్లో  ప్రభుత్వం భారీగా భూములను కేటాయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కార్పొరేషన్‌కు 330 మంది ఉద్యోగులను మంజూరయ్యాయి. అందులో ప్రస్తుతం కేవలం 9 మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో కలిపి మొత్తం 36 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 

ప్రస్తుతం కార్పొరేషన్‌ పరిధిలోని ప్లాట్లు, ఓపెన్ ల్యాండ్స్ మార్కెట్ విలువ సుమారు 3,500 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోనే దాదాపు 300 ఎకరాల భూమి ఉంది. అలాగే పూర్తయిన అపార్ట్‌మెంట్లు, టవర్లు కలిపి సుమారు 1,500 వరకు అందుబాటులో ఉన్నాయి.

రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలో హైదరాబాద్‌లోని బండ్లగూడలో సహభవన, పోచారంలో సద్భావన టౌన్‌షిప్‌లను నిర్మించారు. వీటితో పాటు అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ టవర్లను నిర్మించి విక్రయించారు. గతంలో మిగిలిపోయిన సిద్ధంగా ఉన్న ఫ్లాట్లను, అసంపూర్తిగా ఉన్న టవర్లను ప్రభుత్వం వేలం ద్వారా విక్రయించింది. ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, పబ్లిక్ లాటరీ పద్ధతిలో ఈ ఫ్లాట్లను ప్రభుత్వం కేటాయించింది. హైదరాబాద్, రంగారెడ్డితో పాటు ఇతర ఉమ్మడి జిల్లాల్లో ఉన్న ఓపెన్ ప్లాట్లను కూడా ప్రభుత్వం ప్రస్తుతం దశలవారీగా విక్రయిస్తోంది.

హౌసింగ్ బోర్డులో పెరిగిన కార్యకలాపాలు
ప్రస్తుతం రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో కార్యకలాపాలు ఊపందుకున్నాయి.  క్యూర్  పరిధిలో టవర్ల రూపంలో లక్ష ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అన్ని నియోజకవర్గాల్లో స్థలాలను కూడా గుర్తించారు. త్వరలోనే సీఎం వీటి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 

ప్రస్తుతం హౌసింగ్ బోర్డులో ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లు, టవర్ల నిర్మాణానికి తగిన స్థలాలు లేవు. స్థలాల కొరత ఉన్న చోట రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ భూములను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే రాజీవ్ స్వగృహను హౌసింగ్ బోర్డులో విలీనం చేస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.