మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, మైదానాల్లో క్రీడలపై దృష్టి సారించాలని పశుసంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖా మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియం మైదానంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) ఆధ్వర్యంలో రూ.12.53 కోట్లతో చేపట్టనున్న అంతర్జాతీయ ప్రమాణాల 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్, రూ. కోటితో నాలుగు ఓపెన్ జిమ్స్, రూ.51 లక్షలతో ఇండోర్ జిమ్, మహిళల అథ్లెటిక్స్ హాస్టల్ అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, ఉమ్మడి పాలమూరు జిల్లాలో క్రీడా రంగానికి ఇప్పటికే సుమారు రూ.80 కోట్లు కేటాయించామని, అవసరమైతే రూ.100 కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యమని, క్రీడా ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా త్వరగా అనుమతులు ఇచ్చి పనులను స్పీడప్ చేస్తామని వెల్లడించారు. అనంతరం ‘నషా ముక్త్ భారత్ సప్తాహ్’ సందర్భంగా మాదకద్రవ్యాల నిర్మూలన పోస్టర్‌ను ఆవిష్కరించి, వాటికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వాలీబాల్, కబడ్డీ అకాడమీలతో పాటు క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఒలింపిక్స్‌లో దేశం తరపున బంగారు పతకం సాధించేలా క్రీడాకారులకు ఉత్తమ శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి ఎ.పి. జితేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో క్రీడలకు రూ.50 కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానిని రూ.640 కోట్లకు పెంచిందని తెలిపారు. శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ జానకి, మేయర్ మమత పాల్గొన్నారు.
