- మృతుల సంఖ్య పెరగవచ్చని అధికారుల ఆందోళన
- ప్రాణ భయంతో మొదటి అంతస్తు నుంచి దూకిన విద్యార్థులు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కోచింగ్సెంటర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో మంటల్లో చిక్కుకుని కొందరు, పొగకు ఊపిరాడక మరికొందరు.. మొత్తం 15 మంది మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటనలో మరికొంతమంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. అలీగంజ్ ప్రాంతంలోని ఉషా మెహతా మార్గ్‌లో ఓ మూడంతస్తుల బిల్డింగ్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.
బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ పెట్ క్లినిక్.. మొదటి, రెండు అంతస్తుల్లో విద్యార్థుల కోసం ఒక కోచింగ్ సెంటర్, యానిమేషన్ సెంటర్ నడుస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బిల్డింగ్‌లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కోచింగ్సెంటర్లో ఉన్న విద్యార్థులతో పాటు పలువురు మంటల్లో చిక్కుకున్నారు. అందులోని పలువురు యువకులు మొదటి అంతస్తు నుంచి కిందికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఒక యువకుడు ఫస్ట్ఫ్లోర్నుంచి దూకుతున్న దృశ్యాలు అక్కడికి దగ్గర్లోని సీసీటీవీ కెమరాలో రికార్డైంది. అగ్ని ప్రమాదం విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
స్థానికులతో కలిసి కొంతమంది స్టూడెంట్లను రక్షించారు. సమీపంలోని అగ్నిమాపక కేంద్రాలను అలర్ట్ చేసి ఫైరింజన్లను రప్పించారు. మొత్తం14 అగ్నిమాపక వాహనాలు స్పాట్‌కు చేరుకొని గంటకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. అనంతరం బిల్డింగ్ లోకి వెళ్లిన ఫైర్ సిబ్బంది.. 15 డెడ్ బాడీలను వెలికితీశారు. లోపల ఇంకా కొంతమంది చిక్కుకున్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో బిల్డింగ్ పై అంతస్తుకు చేరుకొని అన్ని గదులు, బాత్రూంలు తనిఖీ చేశారు.
అయితే, లోపల ఎవరూ కనబడలేదని వారు చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్ లోని పెట్ క్లినిక్‌లో చాలా జంతువులు మంటల్లో చిక్కుకుని ఉండవచ్చని జంతు హక్కుల కార్యకర్త కిరణ్ శుక్లా ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం మూడు జంతువుల కళేబరాలను ఫైర్ సిబ్బంది దుప్పటిలో చుట్టి బిల్డింగ్ నుంచి బయటకు తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదం విషయం తెలిసిన వెంటనే డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ స్పాట్‌కు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అధికారులు ఘటనా స్థలంలో గాలింపు చర్యలను పూర్తి చేశారని, లోపల ఎవరూ చిక్కుకోలేదని నిర్ధారించారని మీడియాకు వివరించారు.
ప్రధాని మోదీ విచారం..
అగ్ని ప్రమాదంలో పద్నాలుగు మంది మరణించడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. కోచింగ్ సెంటర్ బిల్డింగ్ లో అగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
మరణించిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలతో సంప్రదింపులు జరిపి వారికి సాధ్యమైనంత సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
