యాదాద్రి/తుంగతుర్తి, వెలుగు: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను 2047 నాటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి జూపల్లి కృష్ణారావు చెప్పారు. యాదాద్రి జిల్లా కేంద్రమైన భువనగిరి కోటను సోమవారం సందర్శించి, అక్కడ జరుగుతున్న రోప్ వే, సౌకర్యాల కల్పన, హోటల్నిర్మాణ పనులను పరిశీలించారు.
పనుల్లో ఆలస్యం జరుగుతుండడంతో ఆఫీసర్లపై అసహనం వ్యక్తం చేశారు. అక్టోబర్ 2 వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కొలనుపాకలోని సోమేశ్వరాలయం, మ్యూజియంను సందర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడారు.
భువనగిరి కోట నుంచి యాదగిరిగుట్ట, కొలనుపాక సోమేశ్వరాలయాన్ని కలుపుతూ టూరిజం సర్క్యూట్ఏర్పాటు చేస్తామని, ఈ సర్క్యూట్లో స్వర్ణగిరిని సైతం కలుపుతామని, సోమేశ్వరాలయంను స్మార్ట్ టెంపుల్‌గా మార్చేందుకు రూ. 5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
సోమేశ్వరాలయం డెవలప్మెంట్ కోసం నాలుగైదు రోజుల్లో డీపీఆర్ రెడీ చేయాలని పురావస్తు శాఖ డైరెక్టర్అర్జునరావును ఆదేశించారు. టెంపుల్ డెవలప్మెంట్పై ఎలాంటి అభ్యంతరాలు వచ్చినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి పరిష్కరిస్తామన్నారు. తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలుపుతామని చెప్పారు.
స్వదేశ్ దర్శన్ స్కీమ్ 2.0 కింద రూ. 56.81 కోట్ల అంచనా వ్యయంతో భువనగిరిలో కోటను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేస్తామని, గంటకు 300 మంది పర్యాటలకు కోటపైకి వెళ్లేలా రోప్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయన వెంట ప్రభుత్వ విప్బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, కలెక్టర్ అనురాగ్‌జయంతి, అడిషనల్కలెక్టర్ భాస్కరరావు, ఆర్డీవో కృష్ణారెడ్డి ఉన్నారు.
అనంతరం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తో కలిసి సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించి, గాజుల బండ బౌద్ధ క్షేత్ర పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఫణిగిరి బౌద్ధ క్షేత్రం అభివృద్ధికి రూ .5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన వెంట రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ పాల్గొన్నారు.
