న్యూఢిల్లీ: అయోధ్యలోని రామ మందిర విరాళాల అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, సీబీఐతో దర్యాప్తు జరిపించాలని పిటిషనర్లు కోర్టును కోరారు.
ఇటీవల గుడి ప్రాంగణంలోని విరాళాల పెట్టెల నుంచి డబ్బు మాయమైందని సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే అంశంపై న్యాయవాదులు అజయ్ కుమార్ రాయ్, దినేష్ కుమార్ యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహణలో నిధుల వ్యవహారం పారదర్శకంగా లేదన్నారు.
ఇది స్వచ్ఛందంగా విరాళాలు అందించిన కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే విచారణ ప్రారంభించినా ఇప్పటివరకు క్రిమినల్ కేసు నమోదు చేయలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
విచారణ సందర్భంగా సేకరించే ఆధారాల చట్టబద్ధత, కోర్టులో వాటి ఆమోదయోగ్యతపై భవిష్యత్తులో అభ్యంతరాలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిధుల లావాదేవీలు, అకౌంటింగ్ రికార్డులు, ఎలక్ట్రానిక్ డేటాబేస్‌లు, ఆడిట్‌కు సంబంధించిన ఆధారాలు తారుమారయ్యే ప్రమాదం ఉన్నందు వెంటనే చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు.
