- ఎన్యుమరేషన్ ఫారాలిచ్చి వివరాలు తీసుకుంటరు
- ఫామ్ ఇవ్వకపోతే డ్రాఫ్ట్ లో పేరుండదు
- రెండు, మూడు చోట్ల ఇస్తే చర్యలు
హైదరాబాద్ సిటీ, వెలుగు :హైదరాబాద్ జిల్లాల్లో గురువారం నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) మొదలవుతుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. సోమవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కర్ణన్మాట్లాడారు. జూలై 24 వరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు(బీఎల్ఓ) జాబితాలో ఉన్న ఓటర్ల ఇంటికి ఎన్యుమరేషన్ఫారాలతో వస్తారన్నారు.
ఓటర్లకు ఫారాలు నింపి తమ ఫొటోతో సహా తిరిగి బీఎల్ఓకే ఇవ్వాలన్నారు. తర్వాత డోర్ కి స్టిక్కర్ వేస్తారన్నారు. - ఫామ్ ఇవ్వకపోతే డ్రాఫ్ట్ లో పేరుండదన్నారు. ఓటర్లు ఒకే చోట ఇన్యూమరేషన్ ఫామ్ ఇవ్వాలని, రెండు, మూడు చోట్ల ఇస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
2002లో ఓటెక్కడ వేశారో చెప్పాలి
2002 స్పెషల్ఇంటెన్సివ్రివిజన్సందర్భంగా ఓటు ఎక్కడ ఉంది? పోలింగ్ స్టేషన్ నెంబర్ ఎంత ? ఓటరు లిస్టులో ఓటు వరుస సంఖ్య వంటి వివరాలను పొందుపరిచి, డిక్లరేషన్ ఇస్తూ సంతకం చేయాల్సి ఉంటుందని కమిషనర్చెప్పారు. 2002లో వివరాలు లేకపోతే ఓటర్లు అప్పుడు ఉన్న ప్రస్తుత ఓటరు కుటుంబ సభ్యుల్లో ఎవరి వివరాలనైనా సమర్పించవచ్చని సూచించారు.
ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే ..
బీఎల్వో సరైన వివరాలు ఇవ్వని వారికి నోటీసులు ఇస్తామని, వారి వద్ద ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే, 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి గుర్తింపును నిరూపించుకోవచ్చన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ ) నియామకం కొనసాగుతోందని, ఇప్పటివరకు10,901 మంది బీఎల్‌ఏలను పార్టీలు నియమించాయన్నారు. ఆన్‌లైన్‌లో ద్వారా కూడా మ్యాపింగ్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు.
ప్రతి నియోజకవర్గానికి ఒక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామని, దీంతో పాటు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులోనూ ఉందన్నారు. ఇండ్లు మారినా తమ ఓటుని ట్రాన్స్ ఫర్ చేసుకోని వారు ఇదివరకు ఎక్కడైతే ఓటు హక్కు ఉందో అక్కడే ఫామ్ అందజేయాలన్నారు. కొత్త ఓటు నమోదు చేసుకోవాలనుకునే వారు ఫామ్–6తో పాటు డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. ఎన్నికల విభాగం అడిషనల్ కమిషనర్ చంద్రకళ పాల్గొన్నారు.
జిల్లాలో 47 లక్షల మంది ఓటర్లు
హైదరాబాద్ జిల్లాలో ప్రస్తుతం 4,062 పోలింగ్ కేంద్రాలు, 1,684 పోలింగ్ ప్రాంతాలున్నాయని, జూన్ 10 నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 47,36,669గా నమోదైందని తెలిపారు. ఇందులో 23,99,880 మంది పురుషులు, 23,36,448 మంది మహిళలు, 341 మంది ఇతరులు ఉన్నారన్నారు.
ఇప్పటి వరకు 22,09,647 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని, 25,27,022 ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేయాల్సి ఉందన్నారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా రిలీజ్చేసి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. తుది ఓటరు జాబితాను అక్టోబర్ 1న ప్రచురించనున్నట్లు వెల్లడించారు.
