- మహిళా సాధికారతకు కాంగ్రెస్ పెద్ద పీట వేస్తోంది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకానిలో ఈ నెల 30న జరిగే బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
సభ ఏర్పాట్లపై చింతకాని మండలం జగన్నాధపురం క్రాస్ రోడ్స్ వద్ద సోమవారం మధిర నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అంతకుముందు సీఎం సభ కోసం పలు స్థలాలను పరిశీలించారు.
అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మధిర నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి భారీ బహిరంగ సభ ఇదేనని చెప్పారు. సభకు వచ్చే రైతులు, ప్రజలకు రవాణాపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వైరా ఎమ్మెల్యే రాందాసు నాయక్ మాట్లాడుతూ ఈ సభకు రైతు ఆశీర్వాద సభ అని పేరు పెట్టాలని సూచించారు.
మహిళా సాధికరతకు పెద్ద పీట
మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 30 నెలల్లోనే రూ.67 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి ప్రతి ఇంటికీ చేరుతోందన్నారు. ఖమ్మంలో సోమవారం జరిగిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
మహిళలకు సమాన అవకాశాలు కల్పించడంతో పాటు, వారిని ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. పదేండ్ల బీఆర్ ఎస్ పాలనలో పేదలు ఇండ్ల కోసం ఎదురుచూసి అలసిపోయారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షల సాయం అందిస్తోందని చెప్పారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, ఈ ఏడాది కూడా నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇండ్లు కేటాయించినట్లు చెప్పారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమే కాకుండా, స్వయం సహాయక సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేయించి, మహిళలనే ఓనర్లుగా చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్క మహిళా నాయకురాలికి కాంగ్రెస్ అండగా ఉంటుందని, అందరి వివరాలు తమ వద్ద ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు సముచిత గౌరవం, పదవులు దక్కేలా చూసే బాధ్యతను తీసుకుంటామన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో అర్హుల ఓట్లు డిలీట్ కాకుండా చూసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యం, సుడా చైర్మన్ పువాళ్ల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
