- యుద్ధానికి శాశ్వత ముగింపే లక్ష్యంగా చర్చలు
- దీనివల్ల అమెరికన్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది
- అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను కొనాలని షరతు
- స్విట్జర్లాండ్‌లో ముగిసిన ఇరాన్–అమెరికా ఫస్ట్ ఫేజ్ డిస్కషన్స్
బర్గెన్‌స్టాక్ (స్విట్జర్లాండ్) : ఇరాన్– అమెరికా మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా జరుగుతున్న మొదటి దశ చర్చలు సత్ఫలితాలనిచ్చాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని ముగించేందుకు, రాబోయే 60 రోజుల్లో తుది ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఓ ముందడుగు పడింది.
అమెరికా వైస్ ప్రెసిడెంట్జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్ బృందం మధ్య స్విట్జర్లాండ్‌లో జరిగిన సుదీర్ఘ, ఉత్కంఠభరిత చర్చలు సోమవారంతో ముగిశాయి. ఆదివారం ఉదయం ప్రారంభమైన ఈ చర్చలు.. తీవ్ర ఉత్కంఠ మధ్య సోమవారం తెల్లవారుజాము వరకు సాగాయి. చర్చల మధ్యలో కొన్ని తీవ్రమైన ఒడిదొడుకులు, ప్రతిష్టంభనలు ఎదురైనప్పటికీ.. చివరికి ఇరు పక్షాలు పట్టువిడుపులు ప్రదర్శించాయి.
ఫలితంగా కొన్ని కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య స్పష్టమైన అవగాహన కుదిరింది. చర్చల అనంతరం అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి చివరిలో ఇరు దేశాల మధ్య ప్రారంభమైన యుద్ధానికి ముగింపు పలికేలా, ఇరాన్‌తో జరిగిన శాంతి చర్చలు ఒక ‘మంచి పునాదిని’ వేశాయని ప్రకటించారు.
‘‘ప్రస్తుతానికి మనం శాంతి ఒప్పందానికి బలమైన పునాది వేశాం. ఇల్లు ఇంకా పూర్తిగా నిర్మించలేదు.. కానీ అమెరికా ప్రజల ప్రయోజనాల కోసం ఒక మంచి పునాదినైతే విజయవంతంగా నిర్మించగలిగాం” అని వాన్స్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య శాశ్వత శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా సాగిన ఈ చర్చల్లో భాగంగా ఒక కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చామన్నారు. అమెరికా నుంచి సోయాబీన్, మక్కజొన్న, గోధుమలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడానికి వీలుగా.. ప్రస్తుతం నిలిపివేసిన (ఫ్రీజ్ చేసిన) ఇరాన్ ఆస్తులను పునరుద్ధరించేందుకు అమెరికా అంగీకరించే అవకాశం ఉందని వాన్స్ సూచనప్రాయంగా తెలిపారు.
దీనివల్ల అటు యుద్ధం ముగియడంతో పాటు ఇటు అమెరికా రైతులకు కూడా భారీ లబ్ధి చేకూరనున్నదని చెప్పారు. తాము చేసుకున్న తాత్కాలిక పీస్ డీల్‌కు ఇరాన్ కట్టుబడి ఉందో లేదో నిర్ధారించేందుకు యూఎన్‌వో అణు తనిఖీ అధికారులు త్వరలో
ఆ దేశాన్ని సందర్శిస్తారని వాన్స్ తెలిపారు.
ఇరాన్ ఆస్తుల విడుదలపై ముందడుగు
తీవ్ర ఉత్కంఠ, ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ చర్చలు పూర్తిగా రద్దు కాలేదు. కాసేపటి తర్వాత ఇరుపక్షాలు తిరిగి చర్చలకు ముందుకు వచ్చాయి. దాదాపు 80 నిమిషాలపాటు సాగిన ఈ దౌత్య సంభాషణల్లో ‘ఇస్లామాబాద్ ఒప్పందం’ అమలు, ఇరాన్ ఆంక్షల సడలింపు, ఫ్రీజ్ అయిన నిధుల విడుదలపై ఇరు దేశాలు సుదీర్ఘంగా చర్చించాయి.
ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ ఆస్తుల విడుదలకు సంబంధించిన విధివిధానాలు ప్రారంభమయ్యాయని, అలాగే ఇరాన్ చమురు ఆంక్షల మినహాయింపులకు సంబంధించిన ముసాయిదా (డ్రాఫ్ట్) కూడా సిద్ధమైందని ఇరాన్ చర్చల కమిటీ సభ్యుడు ఒకరు వెల్లడించారు. కాగా, బాఘేర్ ఘాలిబాఫ్ నేతృత్వంలోని బృందం చర్చల అనంతరం తిరుగుపయనమైంది. సాంకేతిక పరమైన అంశాలపై ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాది నేతృత్వంలో చర్చలు కొనసాగుతున్నాయి.
చర్చల మధ్యలో జేడీ వాన్స్‌కు అవమానం
శాంతి చర్చల సందర్భంగా అమెరికా, ఇరాన్ దౌత్యవేత్తల మధ్య తీవ్ర ఉత్కంఠ, నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. లెబనాన్‌లో హెజ్బొల్లా ద్వారా అలజడులు ఆపకపోతే ఇరాన్‌పై తీవ్రంగా విరుచుకుపడతామంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ బృందం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికా వైఖరిని ‘మీడియా షో’గా అభివర్ణిస్తూ, ఉమ్మడి ఫోటో సెషన్‌ను తిరస్కరించింది. అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో మాట్లాడిన వెంటనే తన బృందంతో కలిసి చర్చల నుంచి వాకౌట్ చేశారు. ఈ ఊహించని పరిణామానికి షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ విస్మయం చెందగా, కొద్ది అడుగుల దూరంలోనే ఉన్న జేడీ వాన్స్ ఆ తర్వాత పాక్ ప్రతినిధుల వద్దకు వెళ్లారు. అదే సమయంలో మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్ ప్రధాని.. పాక్ ప్రధానిని పలకరిస్తూ పక్కనే ఉన్న జేడీ వాన్స్‌ను పూర్తిగా విస్మరించడం చర్చనీయాంశమైంది.
ఇరాన్ చమురుపై ఆంక్షల ఎత్తివేత
పీస్ డీల్‌లో భాగంగా ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ అమెరికా ట్రెజరీ శాఖ 60 రోజుల పాటు తాత్కాలిక లైసెన్స్‌ను జారీ చేసింది. ఈ లైసెన్స్ ద్వారా ఇరాన్ చమురు ఉత్పత్తి, రవాణా మరియు విక్రయాలకు అధికారిక అనుమతి లభించినట్లయింది. ఈ మినహాయింపు ఆగస్టు 21 వరకు అమలులో ఉంటుంది.
