వాట్సాప్ గ్లోబల్ హెడ్‌‌‌‌ గా కునాల్ షా... ఇండియన్ ఫిన్‌‌‌‌ టెక్ కంపెనీ క్రెడ్ ఫౌండర్ కు కీలక బాధ్యతలు

వాట్సాప్ గ్లోబల్ హెడ్‌‌‌‌ గా కునాల్ షా... ఇండియన్ ఫిన్‌‌‌‌ టెక్ కంపెనీ క్రెడ్ ఫౌండర్ కు కీలక బాధ్యతలు
  • మెటాతో రూ.7,515 కోట్ల భారీ డీల్

న్యూఢిల్లీ:ఫేస్‌‌‌‌బుక్ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త గ్లోబల్ హెడ్‌‌‌‌గా ఇండియన్ ఫిన్‌‌‌‌టెక్ కంపెనీ ‘క్రెడ్’ ఫౌండర్ కునాల్ షాను నియమించింది. ఇప్పటివరకు ఆ బాధ్యతల్లో ఉన్న విల్ క్యాత్‌‌‌‌కార్ట్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. దీనితో పాటు క్రెడ్ కంపెనీలో మెటా సంస్థ 900 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 7,515 కోట్లు) భారీ పెట్టుబడిని పెడుతూ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. 

ఫలితంగా క్రెడ్‌‌‌‌లో మెటాకు 20% మైనారిటీ వాటా లభిస్తుంది. తద్వారా ఇండియన్ ఫిన్‌‌‌‌టెక్ రంగంలో మెటా గట్టి పట్టు సాధించనుంది. ఈ నూతన బాధ్యతల నేపథ్యంలో కునాల్ షా మెటా గ్లోబల్ లీడర్‌‌‌‌షిప్ టీమ్‌‌‌‌లో చేరనున్నారు. ఇందుకోసం ఆయన బెంగళూరు నుంచి కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్‌‌‌‌లో గల మెటా ప్రధాన కార్యాలయానికి తన నివాసాన్ని మార్చనున్నారు. మెటా పెట్టిన తాజా నిధులతో క్రెడ్ మార్కెట్ విలువ 4.5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 43,239 కోట్లు) చేరుకుంది. 

ఇది క్రెడ్ సంస్థకు సంబంధించిన 'సిరీస్ హెచ్' నిధుల సేకరణ రౌండ్. పబ్లిక్ లిస్టింగ్ లేదా ఐపీఓకు వెళ్లే ముందు ఆ సంస్థకు ఇదే చివరి నిధుల సేకరణ రౌండ్ అయ్యే అవకాశం ఉంది. కునాల్ షా గతంలో ఫ్రీఛార్జ్, ప్రస్తుతం 'క్రెడ్' వంటి విజయవంతమైన వ్యాపారాలను నిర్మించారు. ప్రస్తుతం యూపీఐ మార్కెట్లో వాట్సాప్ పే తొమ్మిదో స్థానంలో ఉంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిబంధనల వల్ల వాట్సాప్ పే వృద్ధి ఇప్పటివరకు పరిమితంగా సాగింది. 

ఇప్పుడు క్రెడ్ భాగస్వామ్యంతో మెటా తన ఆర్థిక సేవలను మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది. క్రెడ్‌‌‌‌కు దేశీయ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుల్లో 40% వాటా ఉంది. కునాల్ షా గ్లోబల్ బాధ్యతలకు వెళ్తుండటంతో, క్రెడ్ తాత్కాలిక సీఈఓగా మితెన్ సంపత్ బాధ్యతలు స్వీకరించారు.