నీట్ రీఎగ్జామ్ లో చీటింగ్... బిహార్లో 30 మంది అరెస్ట్

నీట్ రీఎగ్జామ్ లో చీటింగ్... బిహార్లో 30 మంది అరెస్ట్
  • అభ్యర్థుల స్థానంలో మెడికోలు, నర్సింగ్ స్టూడెంట్లు

బిహార్ లఖిసరాయ్‌‌‌‌‌‌‌‌లోని హసన్‌‌‌‌‌‌‌‌పూర్ హైస్కూల్ ఎగ్జామ్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో నీట్​ ఎగ్జామ్​ను అభ్యర్థుల స్థానంలో మెడికోలు, నర్సింగ్ స్టూడెంట్లు రాయడానికి ప్రయత్నించారు. ముందుగానే గుర్తించిన బిహార్ పోలీసులు మొత్తం 30 మందిని అరెస్ట్ చేశారు.

పాట్నా: బిహార్ లఖిసరాయ్‌‌‌‌‌‌‌‌లోని హసన్‌‌‌‌‌‌‌‌పూర్ హైస్కూల్ ఎగ్జామ్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో సంజయ్ దత్ సినిమా మున్నాభాయ్ ఎంబీబీఎస్ తరహా ఘటన చోటుచేసుకుంది. ఈ కేంద్రంలో నిజమైన అభ్యర్థులకు బదులు కొందరు మెడికల్ విద్యార్థులు, నకిలీ వ్యక్తులు (సాల్వర్లు) ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నించారు. 

విషయాన్ని ముందుగానే గుర్తించిన బిహార్ పోలీసులు సకాలంలో చీటింగ్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను బట్టబయలు చేశారు. మొత్తం 30 మందిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో వివిధ మెడికల్, నర్సింగ్ కాలేజీలకు చెందిన విద్యార్థులతో పాటు బయోమెట్రిక్ వెరిఫికేషన్ కంపెనీకి చెందిన 14 మంది ఉద్యోగులు కూడా ఉన్నారు.

ఎలా దొరికారంటే..!

చీటింగ్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌కు గయలోని ఏఎన్ఎమ్ మెడికల్ కాలేజీ విద్యార్థి అర్పిత్ రాజ్ సూత్రధారిగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. నీట్ -పీజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ అతన్ని గతంలో విచారించింది. అర్పిత్ రాజ్ ముఠాకు చెందిన పాట్నా మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ స్టూడెంట్ మయాంక్ కశ్యప్.. బయోమెట్రిక్ కంపెనీ ప్రతినిధిలా నటిస్తూ నకిలీ ఐడీ కార్డు సాయంతో లఖిసరాయ్‌‌‌‌‌‌‌‌లోని హసన్‌‌‌‌‌‌‌‌పూర్ హైస్కూల్ ఎగ్జామ్ సెంటర్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించాడు. అక్కడ డ్యూటీలో ఉన్న బయోమెట్రిక్ కంపెనీ ఉద్యోగులకు డబ్బు ఆశ చూపి  లోబరుచుకున్నాడు. 

అసలు అభ్యర్థులకు బదులుగా నకిలీ అభ్యర్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్ష రాసేలా రూట్ క్లియర్ చేశాడు. అయితే, పరీక్షా కేంద్రంలో భద్రతను పర్యవేక్షిస్తున్న సీనియర్ అధికారులకు మయాంక్ కదలికలపై అనుమానం వచ్చింది. వెంటనే బయోమెట్రిక్ సిబ్బంది అధికారిక జాబితాను పరిశీలించగా అతను నకిలీ ఉద్యోగి అని.. ఓ కాలేజీలో వైద్య విద్యార్థి అని తేలిపోయింది. 

దీంతో అధికారులు వెంటనే అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడిని ప్రశ్నించగా చీటింగ్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ గుట్టు బయటపడింది. దీంతో వేరే వాళ్ల తరఫున పరీక్ష రాస్తున్న ఎయిమ్స్, బీహెచ్‌‌‌‌‌‌‌‌యూ వంటి కాలేజీల వైద్య, నర్సింగ్ విద్యార్థులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌గా పట్టుకున్నారు.