హైదరాబాద్, వెలుగు: ఐటీ కంపెనీ సైయెంట్ సీఎస్‌ఆర్ విభాగం సైయెంట్ ఫౌండేషన్, తెలంగాణలో ఇన్నోవేషన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, యువత స్కిల్స్ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రూ. 7.50 కోట్లను మూడేళ్ల కాలంలో పెట్టుబడిగా పెట్టనుంది.
తెలంగాణ ప్రభుత్వ ఉన్నత, సాంకేతిక విద్యా విభాగాలతో పాటు ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూ-హెచ్, పాలమూరు, బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలతో సైయెంట్ ఫౌండేషన్ అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 152 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలలోని విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
ఈ ఇనీషియేటివ్‌లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), జనరేటివ్ ఏఐ, రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక రంగాలలో శిక్షణ ఇస్తారు. నారాయణపేట, మహబూబ్‌నగర్, వరంగల్‌లలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఏటా 600 మంది గ్రామీణ యువతకు హెల్త్‌కేర్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాలలో శిక్షణ ఇస్తారు.
ఇందులో 50శాతం కంటే ఎక్కువ మహిళల భాగస్వామ్యం ఉండేలా చూస్తారు. ఏటా 4 వేల మంది విద్యార్థులకు బిజినెస్ ఐడియాలపై శిక్షణ ఇవ్వడంతో పాటు స్టార్టప్‌లకు ఇంక్యుబేషన్, మెంటార్‌షిప్ సదుపాయం కల్పిస్తారు. అలాగే 200 మందికి పైగా అధ్యాపకులకు నైపుణ్య శిక్షణ ఇస్తారు.
