నారాయణ్ ఖేడ్, వెలుగు: ఫోన్కు వచ్చిన లింక్ ను క్లిక్ చేసిన వెంటనే ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ. 4 లక్షలు కాజేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... కల్హేర్ మండలంలోని మహాదేవపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సెల్ కు సోమవారం ఓ కాల్ వచ్చింది. అతడు అందుబాటులో లేకపోవడంతో అతడి కూతురు ఫోన్ లిఫ్ట్ చేసింది.
అవతలి వ్యక్తులు బ్యాంక్ వివరాలు అప్ డేట్ చేయాలని, ఒక లింక్ పంపించామని చెప్పగానే ఆమె ఆ లింక్ ను క్లిక్ చేసింది. వెంటన్ ఫోన్ హ్యాక్ అయి అతడి అకౌంట్ నుంచి రూ. 4.24 లక్షలు కట్ అయ్యాయి. గమనించిన బాధితుడు వెంటనే 1930 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. అనంతరం కల్హేర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటరెడ్డి తెలిపారు.
