ఎత్తిపోతలకు అగ్గువ కరెంట్!..పగటి పూట లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ల మోటార్లు నడిపే ప్లాన్

 ఎత్తిపోతలకు అగ్గువ కరెంట్!..పగటి పూట లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ల మోటార్లు నడిపే ప్లాన్
  • ఆ టైమ్‌‌‌‌‌‌‌‌లో ఓపెన్ యాక్సెస్‌‌‌‌‌‌‌‌లో యూనిట్‌‌‌‌‌‌‌‌ రూ.2- నుంచి రూ.3కే
  • అనుమతి ఇవ్వడంపై సర్కార్ యోచన
  • ఫలితంగా ఏటా దాదాపు 3 వేల కోట్లు ఆదా అయ్యే  అవకాశం
  • ప్రస్తుతం ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఏటా రూ.7 వేల కోట్ల కరెంట్ బిల్లులు
  • ఇప్పటికే ఇరిగేషన్ నుంచి డిస్కంలకు రూ.33 వేల కోట్లపైన బకాయిలు

హైదరాబాద్​, వెలుగు:  సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టుల కరెంట్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులను నడపడానికి ఏటా దాదాపు రూ.7 వేల కోట్ల పైన కరెంట్ బిల్లులు వస్తున్నాయి. పైగా ఇప్పటికే ఇరిగేషన్ శాఖ నుంచి డిస్కమ్‌‌‌‌‌‌‌‌లకు రూ.33 వేల కోట్ల పైన బకాయిలు పేరుకుపోయాయి. ఈ ఆర్థిక ఊబి నుంచి బయటపడటానికి, ఇకపై రాత్రి వేళల్లో కాకుండా కేవలం పగటిపూట (డే టైమ్‌‌‌‌‌‌‌‌లో) మాత్రమే మోటార్లను నడపాలని సర్కార్ యోచిస్తోంది.

పగటిపూట సోలార్ విద్యుత్ ఎక్కువగా దొరుకుతుంది కనుక, ‘ఓపెన్ యాక్సెస్’ పద్ధతిలో బయటి మార్కెట్ నుంచి యూనిట్ కేవలం రూ.2 నుంచి రూ.3 లకే చౌకగా కరెంట్ కొనవచ్చని భావిస్తోంది. ప్రస్తుతం డిస్కమ్‌‌‌‌‌‌‌‌లు ఇస్తున్న కరెంట్ ధర యూనిట్‌‌‌‌‌‌‌‌కు రూ.6.40 నుంచి రూ.7.10 (సర్​చార్జీలు కాకుండా) తో పోలిస్తే ఇది సగానికంటే తక్కువ. ఈ అగ్గువ కరెంట్ ప్లాన్ గనుక అమలులోకి వస్తే, ప్రభుత్వానికి ప్రతి ఏటా ఏకంగా రూ.3 వేల కోట్ల భారీ మొత్తంలో నిధులు ఆదా అవుతాయని అధికారులు లెక్కలు వేస్తున్నారు.

సాధ్యసాధ్యలపై లోతుగా స్టడీ 

మోయలేని ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నది. భారీ ఎత్తిపోతల పథకాలకు తక్కువ రేటుకే కరెంట్ సరఫరా చేసేలా సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రాత్రి వేళల్లో కాకుండా, కేవలం డే టైమ్‌‌‌‌‌‌‌‌లో మాత్రమే మోటార్లను రన్ చేసేలా ఒక భారీ ప్లాన్‌‌‌‌‌‌‌‌ను రూపొందిస్తున్నారు. పగటిపూట దేశవ్యాప్తంగా సోలార్ పవర్ లభ్యత భారీగా ఉండటం, ఓపెన్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో విద్యుత్ ధరలు అత్యంత చౌకగా లభిస్తుండటాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది.

పగటి వేళల్లో ఓపెన్ యాక్సెస్ విధానం ద్వారా బయటి మార్కెట్ నుంచి యూనిట్ కేవలం రూ.2 నుంచి రూ.3కే కొనుగోలు చేసి, నేరుగా ఎత్తిపోతల ప్రాజెక్టులకు తరలించేలా అనుమతులు ఇవ్వడంపై ఇరిగేషన్, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ఈ ప్రతిపాదన గనుక పట్టాలెక్కితే, ఎత్తిపోతల రంగంలో విద్యుత్ వినియోగ వ్యయం సగానికి సగం తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న విద్యుత్ టారిఫ్ విధానం ఇరిగేషన్ శాఖకు గుదిబండగా మారింది.

డిస్కమ్‌‌‌‌‌‌‌‌లు ప్రస్తుతం ఎత్తిపోతల ప్రాజెక్టులకు సరఫరా చేసే కరెంటుకు గ్రిడ్ చార్జీలు, క్రాస్ సబ్సిడీలతో కలుపుకుని సగటున యూనిట్‌‌‌‌‌‌‌‌కు రూ. 6.40 నుంచి రూ. 7.10 వరకు వసూలు చేస్తున్నాయి. సాధారణ రోజుల్లోనే కాకుండా పీక్ అవర్స్ (ఉదయం, సాయంత్రం వేళల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు) కరెంట్ వాడితే ఈ చార్జీలు మరింత భారంగా మారుతున్నాయి. ఈ భారీ టారిఫ్ వల్లే ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఏటా దాదాపు రూ.7,000 కోట్ల నుంచి రూ.9 వేల కోట్ల వరకు కేవలం కరెంట్ బిల్లుల రూపంలోనే చెల్లించాల్సి వస్తోంది.

అయితే, కొత్తగా ప్రతిపాదిస్తున్న ఓపెన్ యాక్సెస్ పద్ధతి ద్వారా యూనిట్ ధర భారీగా తగ్గనుంది. ఇప్పటికే ఈ ఓపెన్ యాక్సెస్ పద్ధతిపై పవర్‌‌‌‌‌‌‌‌ గ్రిడ్‌‌‌‌‌‌‌‌ కారిడార్ల లభ్యత, సాంకేతిక సాధ్యాసాధ్యాలపై ఇరు శాఖలు లోతుగా చర్చిస్తున్నాయి. ఇక మోటార్లను ప్రతిరోజూ ఆన్ అండ్ ఆఫ్ చేయడం వల్ల పంపింగ్ మిషనరీపై, సర్జ్ పూల్స్‌‌‌‌‌‌‌‌పై ఒత్తిడి పెరిగి, మోటార్లు తరచూ రిపేరుకు వచ్చే ప్రమాదం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎత్తిపోతలకు మస్త్ కరెంట్​ 

బీడు భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా నిర్మించిన ఎత్తిపోతల పథకాల నిర్వహణ, వాటికి అవుతున్న భారీ విద్యుత్ ఖర్చులు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌‌‌‌‌‌‌‌గా మారాయి. నీటిపారుదల శాఖ అధికారిక వర్గీకరణ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా చిన్నవి, పెద్దవి కలిపి మొత్తం 42 ప్రధాన ఎత్తిపోతల ప్రాజెక్టులు (స్కీములు) ఉండగా, అందులో కాళేశ్వరం, కల్వకుర్తి, దేవాదుల, నెట్టెంపాడు, భీమా, ఎల్లంపల్లి సహా దాదాపు 31 ప్రాజెక్టులు ప్రస్తుతం పూర్తిగా, పాక్షికంగా అందుబాటులోకి వచ్చి నీటిని విజయవంతంగా ఎత్తిపోస్తున్నాయి.

భౌగోళికంగా ఎత్తైన పీఠభూమి ప్రాంతంలో ఉన్న తెలంగాణ పొలాలకు నదీ జలాలను తరలించే ఈ భారీ ఎత్తిపోతల వ్యవస్థలన్నీ పూర్తిస్థాయిలో నడవాలంటే గ్రిడ్ నుంచి దాదాపు 9,800 నుంచి 10,500 మెగావాట్ల  గరిష్ట విద్యుత్ సామర్థ్యం అవసరమవుతుందని, నదుల్లో నీటి లభ్యతను బట్టి ఏడాదికి సగటున 11,000 మిలియన్ యూనిట్ల నుంచి 13,500 మిలియన్ యూనిట్ల మేర కరెంట్ వినియోగం జరుగుతోందని అధికారిక అంచనాలు చెబుతున్నాయి.

అయితే, ఈ ప్రాజెక్టులను నడపడానికి కేవలం విద్యుత్ బిల్లుల రూపంలోనే ఏడాదికి రూ.7 వేల కోట్ల నుంచి రూ.9 వేల కోట్ల వరకు ఖర్చవుతుండగా, కాల్వల రిపేర్లు, సిబ్బంది వేతనాలు లాంటి ఇతర నిర్వహణ వ్యయాలన్నీ కలుపుకుంటే ఈ మొత్తం వార్షిక బడ్జెట్ భారం ఏకంగా రూ.11,000 కోట్లకు పైగానే చేరుతోంది. ప్రాజెక్టుల నిర్వహణకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల కంటే ఈ వాస్తవ వ్యయం భారీగా ఉండటంతో, నీటిపారుదల శాఖ నుంచి విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కమ్‌‌‌‌‌‌‌‌లకు) చెల్లించాల్సిన ఎత్తిపోతల కరెంట్ బిల్లుల బకాయిలు కాలక్రమేణా పేరుకుపోయి ప్రస్తుతం రికార్డు స్థాయిలో రూ.33,653 కోట్లకు చేరాయి