- భవ్య స్కీం ఫేజ్1లో రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలి
- ఏరో–డిఫెన్స్ కారిడార్, 2 మెగా లెదర్ పార్కులను మంజూరు చేయండి
- హైదరాబాద్ లో ‘నేషనల్ డిజైన్ సెంటర్’ ఏర్పాటుకు చొరవ చూపండి
- కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో మంత్రి శ్రీధర్ బాబు భేటీ
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి, ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ లక్ష్య సాధనకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా.. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించేలా అభివృద్ధి చేస్తోన్న తెలంగాణ ఇండస్ట్రియల్ ‘ఎకో సిస్టం’ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఆయన భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా.. రాష్ట్ర పారిశ్రామిక రంగానికి సంబంధించిన పలు అంశాలపై పీయూష్ గోయల్‌కు వినతిపత్రం అందజేశారు. ‘‘జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో రూ. 8,500 కోట్ల పెట్టుబడితో గ్లోబల్ ఇన్నోవేషన్, ఆర్ అండ్ డీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు హ్యుందాయ్ గ్రూప్ ముందుకొచ్చింది. అక్కడ లాజిస్టిక్ హబ్ అభివృద్ధి కి కేంద్రం చొరవ చూపాలి’’ అని కోరారు. ‘‘భవ్య పథ కం ఫేజ్1లో భాగంగా రాష్ట్రంలో 15 నుంచి 20 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటికే డీపీఆర్‌లను సిద్ధం చేస్తోంది. జూన్, జులై 2026 దరఖాస్తు విండోలోనే అనుమతి ఇస్తే రాష్ట్రంలో తయారీ రంగం మరింత బలోపేతం అవుతుంది’’ అని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
ఇక్కడ తయారయ్యే యూరియాతెలంగాణకే కేటాయించాలి..
రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్‌సీఎల్)పై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర మంత్రిని శ్రీధర్ బాబు కోరారు. ఆర్ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తి అయ్యే మొత్తం యూరియాను తెలంగాణకే కేటాయించేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతేడాది ఎరువుల సరఫరాలో ఎదురైన అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. అలాగే రాష్ట్రానికి ‘ఏరో–డిఫెన్స్ కారిడార్’ను మంజూరు చేయాల్సిన అవసరాన్ని పీయూష్ గోయల్‌కు ప్రత్యేకంగా వివరించారు.
హైదరాబాద్‌లో ‘నేషనల్ డిజైన్ సెంటర్’ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందు కు కేంద్రం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. మెగా లెదర్, ఫుట్‌వేర్ అండ్ యాక్సెసరీస్ క్లస్టర్ డెవలప్ మెంట్ (ఎంఎల్ఎఫ్‌ఏసీడీ) పథకం కింద రెండు మెగా లెదర్ పార్కులను కేటాయించాలని కోరారు. మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో రూ.2,050 కోట్లతో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్‌హెచ్ఎల్ఎంఎల్) భాగస్వామ్యంతో చేపట్టిన మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో ఏర్పాటు చేస్తున్న ఇర్రేడియేషన్ ఫెసిలిటీకి ట్రేడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్‌పోర్ట్స్ స్కీం(టీఐఈఎస్) కింద నిధులను కేటాయించాలన్నారు. పామ్‌ఆయిల్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని క్రూడ్, పామ్‌ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
